
ఊరికి ఉపకారి
చిత్రంలో రోడ్డుపై ఏర్పడిన గోతులను కాంక్రీట్‌తో పూడ్చుతున్న వ్యక్తిపేరు మద్దెల జనార్దన్. రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి. లగేజీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రామభద్రపురం మండల కేంద్రం నుంచి సోంపురం, ఇట్లామామిడిపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడవ్వడం, పెద్దపెద్ద గోతులతో దర్శనమివ్వడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో కలత చెందాడు. కూలిచేసిన డబ్బుల్లో రూ.30వేలు వెచ్చించి సిమెంట్, ఇసుక, పిక్కను తన లగేజీ ఆటోపైనే తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా కాంక్రీటు మిక్స్‌చేసి రోడ్లపై ఏర్పడిన గోతులను గత రెండు రోజులుగా పూడ్చుతున్నాడు. ఆయన కృషి, చొరవను చూసిన ఈ ప్రాంతీయులు అభినందిస్తున్నారు. ఊరికి ఉపకారి అంటూ కితాబిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెపండగ పేరుతో రోడ్లు మరమ్మతులు చేస్తామంటూ హడావిడి చేసిందే తప్ప రోడ్లను బాగుచేసిన పరిస్థితి లేదంటూ విమర్శిస్తున్నారు. – రామభద్రపురం