
రైతుబజారు స్థల రక్షణకు ప్రజా ఉద్యమం
విజయనగరం గంటస్తంభం: విజయనరం పాత ఆస్పత్రి వద్ద ఉన్న రైతు బజారు స్థలం రక్షణ కోసం ప్రజాఉద్యమం చేపడతామని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్టు సంఘ జిల్లా కార్యదర్మి రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక ఎల్‌బీజీ భవనంలో గురువారం ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ రైతుబజార్ భూమి 22ఏలో నుంచి తప్పించి రాజులకు అప్పగించిన అధికారుల తీరు అన్యాయమన్నారు. 1948లో జమిందారీ వ్యవస్థ రద్దుకావడంతో భూములన్నీ రైతువారీ పద్ధతిలోకి వచ్చాయన్నారు. 1968లో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం, మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో భూములు ఉన్నాయే తప్ప రాజుల ఆధీనంలో ప్రత్యేకంగా ఏమీ లేవన్నారు. చీకటి జీఓలతో భూములను కాజేయాలని రాజులు చూస్తున్నారన్నారు. అందులో భాగంగా జీఓ 124 మేరకు రైతు బజార్ భూమి 1.48 ఎకరాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. చీకటి జీఓలు రద్దుచేసి ఆ భూమిని రైతులకు అప్పగించాలని అధికారులను డిమాండ్ చేశారు. జొన్నగుడ్డిలో పేదలకు పట్టాలిచ్చిన భూమిని ఎందుకు అప్పగించరని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్మి బి.రాంబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఎం.శ్రీనివాస్, ఎస్.రవికుమార్, వెంకటేష్, ఆనంద్, రమణ, జగన్మోహన్‌రావు, హరీష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.