
గిరిజన రైతులపై దౌర్జన్యమా...
రామభద్రపురం: అధికార బలంతో గిరిజన రైతులపై దౌర్జన్యం చేయడం తగదు.. ఏళ్ల తరబడి మా సాగులో ఉన్న భూమిని లాక్కుంటే ఎలా అంటూ కాకర్లవలస గిరిజన రైతులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంఎస్‌ఎంఈ పార్కు పనులను శుక్రవారం అడ్డుకున్నారు. రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది. ఆ భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం రోడ్లు అభివృద్ధి చేస్తామంటూ పనులు ప్రారంభించడంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. సీపీఎం నాయుకుడు బలస శ్రీనువాసరావు ఆధ్వర్యంలో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న సీఐ కె.నారాయణరావు రామభద్రపురం, బాడంగి ఎస్‌ఐలు వి.ప్రసాదరావు, యోగేశ్వరావు, మరో 20 సిబ్బంది కాకర్లవలస చేరుకున్నారు. పనుల వద్దకు గిరిజనులు రాకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్యవాగ్వాదం జరిగింది. జన్ని మరియమ్మ అనే గిరిజన మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఆమెను పైకిలేపి ఇంటికి పంపించేశారు. రైతులతో సీఐ చర్చలు జరిపారు. ప్రస్తుతానికి పనులు వాయిదావేస్తామని, సోమ, మంగళవారాల్లోపు భూ విషయం ప్రభుత్వానితో తేల్చుకోవాలని ఏపీఐఐసీ డీజీఎం చెప్పడంతో గిరిజన రైతులు ఆందోళన విరమించారు.
కాకర్లవలస వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు పనులు అడ్డుకున్న గిరిజన రైతులు
మా సాగులో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఎలా అమ్ముతారని ప్రశ్న
జేసీబీకి అడ్డంగా కూర్చున్న మహిళా రైతులు
గిరిజన రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం

గిరిజన రైతులపై దౌర్జన్యమా...

గిరిజన రైతులపై దౌర్జన్యమా...