వేధింపుల కత్తి! | - | Sakshi
Sakshi News home page

వేధింపుల కత్తి!

Aug 1 2025 1:33 PM | Updated on Aug 1 2025 1:33 PM

వేధింపుల కత్తి!

వేధింపుల కత్తి!

ఉద్యోగుల

మెడపై

సాక్షి, పార్వతీపురం మన్యం:

కూటమి నాయకుల అధికార బలంతో చేసిన వేధింపులకు ఓ దళిత అధికారి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేశ్‌ చూస్తున్న విద్యాశాఖలోని.. ఓ మండల విద్యాశాఖాధికారికే ఈ దుస్థితి ఏర్పడింది. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ ఆ అధికారి.. సదరు ప్రజాప్రతినిధి కాళ్లు మీద పడినా... కనికరం చూపలేదు. ఆ ప్రజాప్రతినిధి పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర కాగా.. ఆ అధికారి బలిజిపేట మండల ఎంఈఓ– 2 శ్రీనివాసరావు. ఎంఈఓ తన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందటే పార్వతీపురం తహసీల్దారుగా పని చేసిన జయలక్ష్మిని ఎమ్మెల్యే బెదిరించినట్టు ఓ ఫిర్యాదు కాపీ బయటకు వచ్చిన విషయం విదితమే.. ఇప్పుడు అదే తరహాలో మరో అధికారి బలి కావడం గమనార్హం.

కోర్టు తీర్పును అమలుచేయొద్దంటూ....

బలిజిపేట మండలంలోని అరసాడ మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, వాచ్‌మన్‌ను ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర ప్రోత్సాహంతోనే తమను తొలగించారని ఉన్నతాధికారుల వద్ద బాధితులు మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీనిపై వారు కోర్టు తలుపుతట్టారు. న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పునూ అమలు చేయనీయకుండా.. ఆ స్థానంలో తమ వారిని నియమించుకునేలా అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితుల ఆరోపణ. అందుకు సంతకం చేయాలని ఎంఈఓ–2 శ్రీనివాసరావును కోరుతున్నారు. ఈ విషయంలో ఇది వరకే కోర్టు తనకు జరిమానా విధించిందని.. ఇకపై ఆ తప్పు చేయనని ఆయన తేల్చేయడం కూటమి నాయకుల ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల కిందట కేజీబీవీ వసతిగృహం ప్రారంభోత్సవానికి మండలానికి వచ్చిన ఎమ్మెల్యే.. ప్రజలు, అధికారులందరి ముందే ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీతో ఏం మాట్లాడినా ఎర్రజెండా వారికి సమాచారం ఇస్తావు. నీపై చర్యలు తీసుకుంటే.. రేపటి నుంచి ఎర్రజెండా పట్టుకుని వారితోపాటే ఆ రోడ్ల మీద తిరగాల్సిందే..’ అంటూ హెచ్చరించారు. అక్కడ నుంచే డీఈఓతో మాట్లాడి.. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తనను ఇబ్బంది పెట్టవద్దని.. కాళ్లు పట్టుకుని బతిమలాడుతానని వయస్సులో పెద్ద వారైన ఎంఈఓ ప్రాథేయపడినా ఫలితం లేకపోయింది. జరిగిన పరిణామాలతో తీవ్ర భావోద్వేగానికి గురైన సదరు ఎంఈఓ.. తన సన్నిహితుల వద్ద ఈ విషయాలన్నీ వాపోతూ కన్నీటి పర్యంతమయ్యారు. డీఈఓ కూడా తన విషయంలో దుర్భాషలాడారని వాపోయారు. నేడో, రేపో తన మీద చర్యలు ఖాయమని.. తనను సస్పెండ్‌ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూటమి ప్రభుత్వంలో అధికారులు ధైర్యంగా పని చేసే పరిస్థితి లేదని.. మండల అధికారులకే వేధింపులు ఉంటే, ఇంక చిరు ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులను తొలగించాలని, పథకాలు అందకుండా చేయాలని.. పనులు నిలిపివేయాలని.. తాము చెప్పిందే చేయాలంటూ కూటమి నేతలు ఆదేశాలిస్తున్నారు. వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. వారి మాటే శాసనం అంటున్నారు. కోర్టు ఉత్తర్వులను అమలుచేయొద్దంటూ భయపెడుతున్నారు. ఉద్యోగాలు పోతాయని కాళ్లుపట్టుకుని అధికారులు ప్రాథేయపడుతున్నా కనికరించడం లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో వేధింపులే తప్ప క్షమించడాలు ఉండవంటూ స్పష్టంచేస్తున్నారు. ఫలితం.. అధికార, ఉద్యోగ వర్గాలు తమ బాధను సహోద్యోగుల వద్ద చెప్పుకుంటూ కన్నీరుపెడుతున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో తమకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటూ నిట్టూర్చుతున్నారు.

నిన్న తహసీల్దార్‌.. నేడు ఎంఈఓ

దళిత విద్యాశాఖాధికారికి పార్వతీపురం ఎమ్మెల్యే బెదిరింపులు

ఎర్రజెండా పట్టుకుని రోడ్డున పడతావంటూ హెచ్చరిక

కన్నీళ్లు పెట్టుకున్న అధికారి

ప్రజాప్రతినిధి వేధింపులపై సన్నిహితుల వద్ద వాపోయిన సదరు అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement