
రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాడి అప్పలనాయుడు
గజపతినగరం: జాతీయ రహదారిపై గజపతినగరం అపోలో మెడికల్ షాపు సమీపంలో శనివారం ఆటో ఢీకొట్టడంతో వృద్ధుడు గాయపడ్డాడు. మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన దాడి అప్పలనాయుడు(65) రోడ్డు గుండా నడిచి వెళ్తుండగా ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వైద్యసేవల కోసం 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేశారు.
మరో సైబర్ మోసం
● రూ.17.50 లక్షలు దోచుకున్న వైనం
భోగాపురం: మండలంలోని పోలిపల్లి గ్రామానికి చెందిన ఓ బాధితుడు రూ.17.50 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణమూర్తి శనివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో బాధితుడి సెల్‌కు అగంతుకుడు ఫోన్ చేసి విదేశీ టూర్ ప్లాన్ ఉందని చెప్పి పలు దఫాలుగా రూ. 17.50 లక్షలు దోచుకున్నాడు. ఈ సమయంలో బాధితుడి ఆధార్‌కార్డు, ఫొటో తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత టూర్ కోసం బాధితుడు ఆరా తీయగా.. అతని ఫొటోను మార్ఫింగ్ చేసి బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేశారు.