సబ్బవరం : ఎన్నికల నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపాలు, ఓటరు జాబితాలోని తప్పిదాలు చర్చకు దారితీస్తున్నాయి. సబ్బవరం మండలం ఇరువాడ పోలింగ్ కేంద్రంలో ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటు వేసిన ఘటన కలకలం రేపింది. ఓటరు జాబితాలో రెండు చోట్ల పేరు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని పొట్ల కృష్ణ అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఒకసారి, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మరోసారి ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండుసార్లు ఓటు వేసిన వ్యక్తి టీడీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇరువాడలోని 59వ పోలింగ్ బూత్ ఓటర్ల జాబితాలో పొట్ల కృష్ణ పేరు 654, 1159 సీరియల్ నంబర్లతో రెండుసార్లు నమోదైనట్లు సమాచారం. ఉదయం ఓటు వేసిన ఆయన, మధ్యాహ్నం మరోసారి వచ్చి ఓటు వేయడాన్ని వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్ గొంతున అచ్చంనాయుడు గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ పోలింగ్ సిబ్బంది సమక్షంలోనే రెండోసారి ఓటు వేసి వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నాయకులు బలిరెడ్డి కనకరాజు, సండ్రాన అప్పారావు, ధూళి నరేష్, మొల్లి చిన్నారావు, బంగారునాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మండల పార్టీ అధ్యక్షుడు కర్రి బాబు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనపై రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదవడం, అభ్యంతరం వ్యక్తమైనప్పటికీ రెండోసారి ఓటు వేయడం ఎలా సాధ్యమైందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకే పోలింగ్ కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం
(654, 1159 సీరియల్ నంబర్లు) ఓటేసిన పొట్ల కృష్ణ


