ద్వారకానగర్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను ఆకర్షించి, వారిని సైబర్ నేరాల వైపు మళ్లించిన గాజువాకకు చెందిన ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్ వినయ్‌కుమార్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పునరావృతంగా సైబర్ నేరాలకు యువతను ప్రోత్సహిస్తూ ప్రజల ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాడన్న కారణంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన చుక్క రాజేష్ వినయ్‌కుమార్ ఓ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తూ, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను కంబోడియాలోని సైబర్ స్కామ్ కంపెనీలకు పంపిస్తున్నాడు. వివిధ జిల్లాలకు చెందిన యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసి విదేశాలకు పంపించినట్లు తెలిపారు.కంబోడియా వెళ్లిన యువతను అక్కడి ఏజెంట్లు సైబర్ మోసాలకు పాల్పడే కంపెనీలకు అప్పగించి, భారత్‌కు వ్యతిరేకంగా స్కామ్‌లు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుల ఫిర్యాదుల ద్వారా వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి రాజేష్ వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.విచారణలో నిందితుడు తాను నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ద్వారా విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను పంపిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అభ్యర్థుల నుంచి నగదు లేదా ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకుని విమాన టికెట్లు, కరెన్సీ మార్పిడి, ఈ–వీసా ప్రక్రియలను పూర్తి చేసి కంబోడియాలోని ఏజెంట్ల వద్దకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి ఏజెంట్లు యువతను సైబర్ స్కామ్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
యువత అప్రమత్తంగా ఉండాలి
మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ఇలాంటి మోసపూరిత ఉద్యోగాల కోసం వెళ్లి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


