సైబర్‌ టెర్రర్‌ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ టెర్రర్‌

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

విశాఖలో
ఏడేళ్లలో రూ.347.82 కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు 25,438 ఫిర్యాదులు.. వృద్ధులు, పెన్షనర్లే లక్ష్యంగా దోపిడీలు డిజిటల్‌ అరెస్టుల పేరుతో రూ.1.94 కోట్లు స్వాహా

ద్వారకానగర్‌: ఒకప్పుడు దొంగలు ఇళ్లలోకి చొరబడి దోచుకునేవారు. ఇప్పుడు చేతిలో ఫోన్‌ ఉంటే చాలు. కాలు కదపకుండానే కూర్చున్న చోటు నుంచే ఖాతాలను కొల్లగొడుతున్నారు. తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు. కత్తులు చూపించాల్సిన అవసరం లేదు. ఒక లింక్‌ క్లిక్‌తో జీవితకాల సంపాదనను స్వాహా చేస్తున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఓటీపీల వేట.. పోలీసులమంటూ డిజిటల్‌ అరెస్టు బెదిరింపులు.. పెట్టుబడులపై భారీ లాభాలంటూ ఆశల వల.. ఇలా సైబర్‌ నేరగాళ్లు విశాఖ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్తకొత్త పద్ధతుల్లో దోపిడీలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లను బుట్టలో వేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. స్మార్ట్‌ సిటీగా పేరొందిన విశాఖలో సైబర్‌ నేరాల తీవ్రత ఎంతలా పెరిగిందంటే.. గత ఏడేళ్లలో బాధితులు పోగొట్టుకున్న సొమ్ము అక్షరాలా రూ.347.82 కోట్లు. 25,438 ఫిర్యాదులు.. 2,524 కేసులు.. 9,781 మంది బాధితులు.. ఈ గణాంకాలు డిజిటల్‌ దోపిడీ ఏ స్థాయిలో సాగుతోందో కళ్లకు కడుతున్నాయి.

ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ఖాతా ఖాళీ

సైబర్‌ నేరగాళ్లు అమాయకుల బలహీనతలనే పెట్టుబడిగా చేసుకుంటున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి లింకులు పంపుతున్నారు. స్పెల్లింగ్‌లో చిన్న మార్పులు చేసి అసలైన వెబ్‌సైట్లుగా నమ్మిస్తున్నారు. మరోవైపు ఫోన్‌కు ఓటీపీ వచ్చిందని, వెరిఫికేషన్‌ కోసం చెప్పాలని కోరుతున్నారు. నమ్మి ఓటీపీ చెప్పగానే ఖాతాల్లోని నగదును ఇతర ఖాతాలకు మళ్లించేస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వల విసురుతున్నారు. క్రిప్టో కరెన్సీ, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయంటూ ఉద్యోగులు, వ్యాపారులను మోసగిస్తున్నారు.

వృద్ధులే టార్గెట్‌.. కష్టార్జితమే వేట

సాంకేతిక పరిజ్ఞానంపై సరైన అవగాహన లేని వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు సైబర్‌ ముఠాలకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారు. తొందరగా నమ్మే స్వభావం, ఒంటరితనం, ఆన్‌లైన్‌ లావాదేవీలపై అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. పోలీసులమంటూ వీడియో కాల్స్‌ చేసి బెదిరించడం.. కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టడం.. విచారణ పేరుతో బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును బదిలీ చేయించుకోవడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. భయంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేకపోవడంతో నేరగాళ్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

డిజిటల్‌ అరెస్టు.. రూ.1.94 కోట్ల దోపిడీ!

విశాఖలో డిజిటల్‌ అరెస్టు మోసం ఎంతటి తీవ్రతకు చేరిందో అక్కయ్యపాలెం పరిధి లలితనగర్‌ ఘటన చూస్తే అర్థమవుతుంది. అక్కడి విశ్రాంత ఉద్యోగి కారి గోపాల రామానుజం (65)కు పోలీసులమంటూ వాట్సాప్‌ వీడియో కాల్‌ చేశారు. పోలీసు దుస్తుల్లో కనిపిస్తూ బెదిరింపులకు దిగారు. కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా 13 విడతల్లో రూ.1.94 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏడేళ్లలో రూ.347.82 కోట్ల గల్లంతు!

విశాఖలో సైబర్‌ నేరాల పెరుగుదలకు నమోదైన గణాంకాలే సాక్ష్యం. 2019 నుంచి 2026 వరకు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో 25,438 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 2,524 కేసులు నమోదు కాగా, 9,781 మంది బాధితులుగా మారారు. మొత్తం రూ.347,82,04,615 మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 2019లో కేవలం 104గా ఉన్న ఫిర్యాదులు 2025 నాటికి 7,531కు చేరడం సైబర్‌ నేరాల విస్తృతిని తెలియజేస్తోంది.

ప్రతి ఏటా కోట్లలో..

ఏడాది దోపిడీ

2022 రూ.13.33 కోట్లు

2023 రూ.29.46 కోట్లు

2024 రూ.104.53 కోట్లు

2025 రూ.121.29 కోట్లు

2026(ఇప్పటి వరకు) రూ.63.64 కోట్లు

మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి

సైబర్‌ నేరగాళ్లు ముఖ్యంగా వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ కాల్స్‌ వస్తే అప్రమత్తంగా ఉండాలి. మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

– భవాని ప్రసాద్‌,

ఇన్‌స్పెక్టర్‌, సైబర్‌ క్రైమ్‌

అప్రమత్తతే అసలైన రక్షణ

సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడగవు. అపరిచితులు పంపే లింకులను తెరవకూడదు. వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

– డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి,

నగర పోలీస్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement