కందిపప్పుకు కటకట, రాగులకు రాం రాం, పంచదారకు మంగళం..! హామీలన్నీ హుష్ కాకి.. రేషన్ సరకులన్నీ మాయం! బియ్యంతోనే బతకమంటున్న కూటమి పాలకులు
మహారాణిపేట: గతంలో ఎన్నికల ముందు ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన తెలుగుదేశం అధినేత, అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పూర్తిగా గాలికి వదిలేశారు. గత 28 నెలల కాలంలో కందిపప్పును కేవలం రెండుసార్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రాగుల సరఫరా అయితే ’మూన్నాళ్ల ముచ్చట’గానే మిగిలిపోయింది. కొన్ని మాసాలుగా రాగుల ఊసే లేదు. వంటనూనె సరేసరి. పప్పుల పత్తా లేదు. ఇప్పుడు నవంబర్ నెల కోటాలో పంచదారను కూడా పూర్తిగా ఎత్తివేసి పేదోడి నోట సున్నం కొడుతున్నారు.
బహిరంగ మార్కెట్ బాటలో సరకులు
గతంలో రేషన్ షాపుల్లో అరకిలో పంచదార రూ.17కే లభించేది. కానీ నవంబర్ కోటా కేటాయింపులు రాకపోవడంతో ఆ కాస్త పంచదార కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో పంచదార రూ.70 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. మార్కెట్లో ధరలు భగ్గుమంటున్న వేళ, పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే రేషన్ పంచదారను ఎత్తివేయడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. ప్రతి వస్తువునూ బహిరంగ మార్కెట్లో భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితలో ప్రజలు సతమతమవుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా క్రమం తప్పకుండా కందిపప్పు పంపిణీ జరిగేది. లబ్ధిదారుడికి కిలో కందిపప్పును కేవలం రూ.70కే అందించేవారు. మార్కెట్‌లో ధరలు ఎగబాకుతున్నా, పీడీఎస్ ద్వారా తక్కువ ధరకే పప్పు దొరకడంతో సామాన్యులకు ఎంతో ఊరట లభించేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. బహిరంగ మార్కెట్లో రూ.180 నుంచి రూ.200 మధ్య ధరకు కందిపప్పు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులున్నా.. ఫలితం సున్నా!
విశాఖ అర్బన్ డీఎస్‌వో పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి తదితర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 5,17,619 తెల్ల రేషన్ కార్డులు, 625 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం.. ఒక జిల్లా సప్లై ఆఫీసర్(డీఎస్‌వో), ముగ్గురు ఏఎస్‌వోలు, 21 మంది చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం అవసరమైన సరకులు అందడం లేదు. కాగితాలపై అధికార బలగం ఎంత ఉన్నా, రేషన్ షాపుల్లో ’ఖాలీ సంచుల రాజ్యాంగం’ నడుస్తోంది. నమ్మించి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన మాట తప్పడం కూటమి సర్కార్‌కు పరిపాటిగా మారిందని విశాఖ ప్రజలు మండిపడుతున్నారు.
ఎన్నికల వేళ కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక వాటిని బంగాళాఖాతంలో కలిపేయడంలో కూటమి ప్రభుత్వానికి తిరుగులేదని పదేపదే నిరూపితమవుతోంది. పేద ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా అందిస్తున్న సరకుల్లో నానాటికీ కోత విధిస్తుండటమే దీనికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. రేషన్ దుకాణాల ద్వారా పూర్తిస్థాయి నిత్యావసర సరకులు అందని దుస్థితి. కేవలం అరకొర బియ్యంతోనే కాలం వెళ్లదీస్తున్న ఈ ప్రభుత్వం.. పేదోడి పప్పన్నం కలలపై ఎడాపెడా కత్తెర వేస్తోంది.


