కల్తీకి కాపలా ఎవరు? | - | Sakshi
Sakshi News home page

కల్తీకి కాపలా ఎవరు?

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

ఏళ్లగా డిప్యూటేషన్‌లోనే అధికారులు తనిఖీలు నామమాత్రం.. చర్యలు బలహీనం అవగాహన లేదు.. ఫిర్యాదు చేసినా స్పందన లేదు

బీచ్‌రోడ్డు: విశాఖలో ప్రముఖ హోటళ్లలో వరుసగా కుళ్లిన చికెన్‌, పాడైన ఆహారం బయటప డుతున్నా.. అసలు ఈ దందా ఇంత విచ్చలవిడిగా సాగడానికి కారణం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానంగా ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో ఏళ్ల తరబడి డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న అధికారుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సిబ్బంది కొరత పేరుతో అధికారులు మారకపోవడం, హోటళ్లపై క్రమం తప్పకుండా తనిఖీలు లేకపోవడం వల్లే కల్తీ ఆహార దందా పెచ్చరిల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల సాక్షి కథనాల తర్వాత అధికారులు వరుస దాడులు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని కామత్‌ హోటల్‌లో 60 కిలోల కుళ్లిన చికెన్‌, సిరిపురంలోని పిస్తా హౌస్‌లో నిల్వ చికెన్‌, జగదాంబలోని ఆల్ఫా హోటల్‌లో డ్రైనేజీ పక్కనే వంట, ఈస్టర్న్‌ స్టార్‌లో నల్లబడిన వంటనూనె, ఎంవీపీ సెక్టార్‌–8లోని వాయుపుత్ర టిఫిన్స్‌ అండ్‌ మీల్స్‌లో 28 కిలోల పాడైన ఆహారం స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదైనా.. ఏడాది పొడవునా ఇలాంటి తనిఖీలు ఎందుకు జరగడం లేదన్న ప్రశ్న మాత్రం తీరడం లేదు.

10 వేలకుపైగా హోటళ్లకు ఇద్దరే అధికారులు

జీవీఎంసీ పరిధిలో 10 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు కనీసం 12 మంది ఫుడ్‌ సేఫ్టీ అధికారులు అవసరం. ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తుండగా, వారిలో ఒకరు దాదాపు 20 ఏళ్లుగా అదే కార్యాలయంలో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. మరో అధికారి కూడా చాలా కాలంగా విశాఖలోనే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం.

సత్సంబంధాలే కల్తీకి అండా?

ఏళ్ల తరబడి ఒకేచోట కొనసాగడం వల్ల హోటల్‌ యాజమాన్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్ల వ్యవహారం సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై కూడా కేవలం జరిమానాలతో సరిపెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తనిఖీలు తక్కువ.. గోప్యత ఎక్కువ

గత ఏడాదిలో జరిగిన తనిఖీలు 50 కూడా దాటలేదు. తనిఖీలు చేసినా హోటళ్ల పేర్లు బయటకు రానివ్వకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న సంస్థల వివరాలను కూడా గోప్యంగా ఉంచడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

లైసెన్సు రద్దు చేయడం లేదు ఎందుకు?

కల్తీ ఆహారం విక్రయిస్తే చట్టం ప్రకారం లైసెన్సు రద్దు, క్రిమినల్‌ కేసులు, జైలుశిక్ష వరకు నిబంధనలు ఉన్నాయి. కానీ విశాఖలో ఇప్పటివరకు ఒక్క హోటల్‌ లైసెన్సు కూడా రద్దు కాలేదు. నోటీసులు, స్వల్ప జరిమానాలతోనే వ్యవహారం ముగుస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

అవగాహన కార్యక్రమాలు శూన్యం

ఫుడ్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం హోటల్‌ యజమానులు, వంట సిబ్బంది, స్ట్రీట్‌ఫుడ్‌ విక్రేతలు, విద్యార్థులకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి హోటల్‌లో ఫిర్యాదు టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రదర్శించాలి. అయితే విశాఖలో ఇలాంటి కార్యక్రమాలు దాదాపు కనిపించడం లేదని తెలుస్తోంది.

ఫిర్యాదు ఎలా చేయాలి

కల్తీ ఆహారంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 1800–425–2977కు ఫోన్‌ చేస్తే స్పందన ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదులు చేయడమే కష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా డిప్యూటేషన్‌లో ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని, జీవీఎంసీకి కనీసం 12 మంది ఫుడ్‌ సేఫ్టీ అధికారులను నియమించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రతి వార్డులో నెలకు ఒకసారి తనిఖీలు నిర్వహించి నివేదికలను ఆన్‌లైన్‌లో ఉంచాలని, కల్తీ ఆహారం విక్రయించే హోటళ్ల లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరుతున్నాయి. అలాగే ప్రతి జోన్‌కు ప్రత్యేక ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌, వాట్సాప్‌ ఫిర్యాదు నంబర్‌, 24 గంటల్లో స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement