తొలిరౌండ్‌ హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌ హోరాహోరీ

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

ప్రారంభమైన

గోల్ఫ్‌ టోర్నీ

విశాఖస్పోర్ట్స్‌: గ్రీన్‌ ఫ్యూయల్‌ మారిటైమ్‌ ఆహ్వాన గోల్ఫ్‌ టోర్నీ విశాఖ ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ తొలి రౌండ్‌లో గగన్‌జీత్‌ భుల్లర్‌ మూడు అండర్‌–69 స్కోర్‌తో ఆకట్టుకునే ఆరంభం చేశారు. తొలి రౌండ్‌లో దీపక్‌, కనవ్‌, రవికుమార్‌లు కూడా మూడు అండర్‌–69 స్కోర్‌లు నమోదు చేసి గగన్‌జీత్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఏఎం గ్రీన్‌ ఐజీపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన గగన్‌జీత్‌తో పాటు తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు ఆటగాళ్లు తొలిరోజు ఆధిక్యంలో నిలిచారు. విశాఖ కోర్సులో గత అనుభవాన్ని దీపక్‌ సద్వినియోగం చేసుకోగా.. రవికుమార్‌, కనవ్‌ చౌహాన్‌లు కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. నాలుగో హోల్‌ నుంచి ఆట ప్రారంభించిన గగన్‌జీత్‌ వరుసగా ఐదు పార్‌లతో నిలకడగా ఆడి, తొమ్మిదో హోల్‌లో తొలి బర్డీ సాధించారు. 15వ హోల్‌ నుంచి వరుసగా మూడు బర్డీలతో జోరు పెంచి 69 స్కోర్‌తో రౌండ్‌ను ముగించారు. ఈస్ట్‌పాయింట్‌ కోర్సులో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన దీపక్‌ బోగీ లేకుండా 69 స్కోర్‌ సాధించారు. 14వ హోల్‌ నుంచి ప్రారంభించిన ఆయన మూడు బర్డీలు నమోదు చేసి తప్పిదాలు లేకుండా తొలి రౌండ్‌ను పూర్తి చేశారు. ఈ సీజన్‌లో ఏఎం గ్రీన్‌ ఐజీపీఎల్‌లో ప్రొఫెషనల్‌గా మారిన రవికుమార్‌ కూడా 69 స్కోర్‌తో ఆకట్టుకున్నారు. ఆరో హోల్‌ నుంచి ప్రారంభించి బర్డీలతో ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఆల్‌ ఇండియా జూనియర్‌ చాంపియన్‌ కనవ్‌ చౌహాన్‌ సైతం మూడు అండర్‌–69 స్కోర్‌ నమోదు చేశారు. 11 సార్లు ఏసియన్‌ టూర్‌ విజేతగా నిలిచిన గగన్‌జీత్‌ భుల్లర్‌ విశాఖలో తొలిసారి బరిలోకి దిగి తన అనుభవంతో తొలి రౌండ్‌లో ఆధిక్యం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement