కూటమి గుండాగిరీ | - | Sakshi
Sakshi News home page

కూటమి గుండాగిరీ

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

అడుగడుగునా దాడుల పర్వం

పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ,

జనసేన శ్రేణుల అరాచకాలు

పలు చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడిన

కూటమి నేతలు

గొడవలు సృష్టించి ఓటర్లను

ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు

ఖాకీల సహకారంతో వైఎస్సార్‌సీపీ

నేతలను అడ్డుకున్న అధికారపక్ష నేతలు

ఓటింగ్‌ సరళిపై గుబులు..

కూటమి శ్రేణుల హల్‌చల్‌

సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిపై కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. ఉదయం 9 గంటలకే తమ అంచనాలు తలకిందులవుతున్నాయని భావించి అలజడులకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేల ఆదేశాలతో టీడీపీ, జనసేన నేతలు రంగంలోకి దిగి నిబంధనలు అతిక్రమిస్తూ హల్‌చల్‌ చేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడగా, మరికొన్ని చోట్ల ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో వాగ్వాదాలకు దిగుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. జీవీఎంసీ పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 9 గంటల సమయానికి ఓటింగ్‌ సరళిపై ఆందోళనకు గురైన కూటమి శ్రేణులు వివిధ వార్డుల్లో ఇబ్బందులు సృష్టిస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నించారు.

● తూర్పు నియోజకవర్గంలోని ఏయూ హైస్కూల్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో వాగ్వాదానికి దిగి తోపులాటకు పాల్పడ్డారు.

● దక్షిణ నియోజకవర్గంలోని 37వ వార్డులో జనసేన నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల సమక్షంలో హడావుడి సృష్టించారు. దీనిపై మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

● మద్దిలపాలెం కృష్ణా కాలేజీలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, బ్యాలెట్‌ పేపర్లు బయటకు తీసుకొస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ నేతలు బ్యాలెట్‌ పేపర్లను బయటకు తీసుకొచ్చి బహిరంగంగా ప్రదర్శించినా పోలీసులు పట్టించుకోలేదు.

● తూర్పు నియోజకవర్గంలోని 26/6 పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ అయిపోయిన తర్వాత.. ముగ్గురు కూటమి నేతలు బూత్‌లోకి వెళ్లి తలుపులు మూసేశారు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దాదాపు 30 నిమిషాల పాటు పోలింగ్‌ బూత్‌లో ఉన్నారని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

● 28వ వార్డు భానోజీనగర్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు భవానీ శంకర్‌పై రాళ్లతో దాడి జరిగింది. టీడీపీ నేత, ఏయూ ఉద్యోగి అబ్బాస్‌ రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన భవానీ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు.

● 12వ వార్డులో జనసేన నేతలు రిగ్గింగ్‌కు యత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

● తాటిచెట్లపాలెంలో వైఎస్సార్‌సీపీ మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా కూటమి నేతలు పోలీసుల సాయంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఓటర్లు భయాందోళనకు గురయ్యారు.

● 65వ వార్డు ధర్మానగర్‌లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడటంతో పాటు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు.

● 78వ వార్డు ఏడుగుళ్ల జంక్షన్‌ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న కూటమి శ్రేణులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

● 22వ వార్డు అల్వార్‌దాస్‌ పబ్లిక్‌ స్కూల్‌ బూత్‌లో ఓటర్లను మభ్యపెడుతున్న టీడీపీ నేతలను తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదం చోటుచేసుకుంది.ఇలా పలు వార్డుల్లో కూటమి నేతల వ్యవహారశైలితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి భయంతోనే రిగ్గింగ్‌, ప్రలోభాలకు పాల్పడి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

● ఉత్తర నియోజకవర్గంలోని 46, 47వ వార్డుల్లో పోలింగ్‌ స్టేషన్లలో టీడీపీ, జనసేన శ్రేణులు అరాచకం సృష్టించాయి. పోలింగ్‌ సమయం ముగిసిపోయిందని పోలీసులు గేట్లు వేసినా.. జనసేన, టీడీపీ మూకలు పోలింగ్‌ కేంద్రాల గేట్లు బద్దలు కొట్టి లోపలికి చొరబడి.. రిగ్గింగ్‌ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement