ఆంక్షల చాటున అరాచకం | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల చాటున అరాచకం

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

గంటకో రూల్‌..

అడుగడుగునా ఆంక్షలు

ప్రజాస్వామ్యానికి సంకెళ్లు

ఆంక్షలే అస్త్రంగా..

అక్రమాలకు అండగా..

పోలింగ్‌ వేళ పోలీస్‌ ఓవరాక్షన్‌

నిబంధనల పేరిట మీడియాపై

ఉక్కుపాదం!

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలీసులు నిబంధనల పేరిట విధించిన ఆంక్షలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద గంటకో విచిత్రమైన నిబంధనను అమలు చేస్తూ, అడుగడుగునా ఆంక్షలు విధించడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ నవ్వులపాలవుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన యంత్రాంగం.. అధికార కూటమి నేతల అక్రమాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. పోలింగ్‌ సరళిని, అధికార పార్టీ నేతల అక్రమాలను మీడియా ప్రపంచానికి చూపించకుండా చేసేందుకే పోలీసులు ఈ తరహా ఆంక్షలు విధించారు. పలు కేంద్రాల వద్ద కూటమి నేతలు ఓటర్లను ప్రభావితం చేయడం, స్థానికేతరులను తరలించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. అయితే వీటిని కవరేజ్‌ చేసేందుకు ప్రయత్నించే రిపోర్టర్లపై మాత్రం ఆంక్షల ఉక్కుపాదం మోపారు.

నిబంధనలకు తూట్లు..

అడుగడుగునా అడ్డంకులు

కూటమి పార్టీలు చేస్తున్న అక్రమాలకు, రిగ్గింగ్‌కు పోలీసులు అండగా నిలిచారు. కూటమి నేతలు సాగిస్తున్న అక్రమాలకు రక్షణ కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 37వ వార్డులో బహిరంగంగా రిగ్గింగ్‌ జరుగుతున్నా అక్కడ రిటర్నింగ్‌ అధికారి ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. దీనిపై ప్రశ్నించేందుకు వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి అక్కడికి వెళ్లగా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌లో కూటమి పార్టీలకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి, సాయంత్రం 5 గంటల తర్వాత లోపలికి రానివ్వకుండా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. అదేవిధంగా 48వ వార్డులో రిగ్గింగ్‌ జరుగుతోందనే సమాచారం రావడంతో మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. తాటిచెట్లపాలెం వాటర్‌ ట్యాంక్‌ వద్ద కూడా మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి, కార్పొరేటర్‌ అభ్యర్థిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఏయూ హైస్కూల్‌ వద్ద సమయం ముగిసిందనే కారణంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కొన్ని చోట్ల పోలీసులు అనుమతించలేదు. మరికొన్ని చోట్ల సమయం దాటిపోయినా కూటమికి అనుకూలమైన ఓటర్లకు ఓటు వేసేందుకు నిబంధనలను సడలించారు.

మీడియాపై ఆంక్షలు

పోలింగ్‌ సరళిని, అధికార పార్టీ నేతల అక్రమాలను మీడియా ప్రపంచానికి చూపించకుండా చేసేందుకే పోలీసులు ఈ తరహా ఆంక్షలు విధిస్తుంచారన్న ఆరోపణలున్నాయి. పలు కేంద్రాల వద్ద కూటమి నేతలు ఓటర్లను ప్రభావితం చేయడం, స్థానికేతరులను తరలించడం వంటి అంశాలు జరుగుతున్నా పోలీసులు కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారు. వీటిని కవరేజ్‌ చేసేందుకు ప్రయత్నించే రిపోర్టర్లపై మాత్రం ఉక్కుపాదం మోపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులు, నేతలకు పోలింగ్‌ కేంద్రాల వద్ద స్వేచ్ఛా విహారం కల్పిస్తూ.. వార్తలు సేకరించే విలేకరులను మాత్రం 100 మీటర్ల అవతలే నిలిపివేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ జర్నలిస్టులను పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కెమెరాలను నిలిపివేయడం, వార్తలు సేకరించే రిపోర్టర్లను బెదిరించడం పరిపాటిగా మారింది.గంటకో ఆంక్ష మారుస్తూ మీడియాపై నిర్బంధం విధించడంపై పాత్రికేయ సంఘాలు, పౌర సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement