ప్రజాతీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రం ఏయూ క్యాంపస్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు 9 భవనాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు 3న ఎన్నికల ఫలితాలు
సాక్షి, విశాఖపట్నం : గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు, అభ్యర్థుల భవితవ్యం దాగిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత.. ఆయా కేంద్రాల్లోని ఏజెంట్లు, అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసిన ఏయూ క్యాంపస్‌కు వాహనాల్లో తరలించారు. మొత్తం 120 వార్డుల ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇక్కడే జరగనుంది. నగర పోలీస్ విభాగం వారు స్ట్రాంగ్ రూములకు రెండు తాళాలు వేయడంతో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించే సమయంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ 5 రౌండ్లలో పూర్తిచేసేలా అవసరమైన టేబుళ్లు, సిబ్బంది, ఇతర సౌకర్యాలపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తిచేశారు.
● స్ట్రాంగ్ రూమ్‌లకు వేసిన రెండు తాళాలకు సంబంధించిన తాళంచెవి ఒకటి స్ట్రాంగ్ రూమ్ ఇన్‌చార్జ్ వద్ద, మరొకటి మేజిస్టీరియల్ అధికారాల వద్ద ఉంచారు.
● 24 గంటల పాటు సాయుధ పోలీసు బలగాలు పహారా కాయడంతో పాటు సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ ఉంచారు.
● మూడంచెల భద్రతా వ్యవస్థలో మొదటి అంచెలో ఏఆర్ విభాగానికి చెందిన 51 మంది సాయుధ గార్డులతో భద్రత కల్పించారు. రెండో అంచెలో సివిల్ పోలీసులు, మూడో అంచెలో ట్రాఫిక్ పోలీసులను నియమించారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
● స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంగణం మొత్తాన్ని భద్రతా వలయంగా మార్చారు. ఆ ప్రాంగణంలోకి ఉన్నతాధికారులతో సహా ఎవరి వాహనాలను అనుమతించకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
● ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, స్థానిక పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి రోజూ స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక అందించనున్నారు.
● స్ట్రాంగ్ రూమ్స్‌కి వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు కచ్చితంగా లాగ్ బుక్‌లో నమోదు చేయాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సాయుధ బలగాలను ఆదేశించారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియోలో రికార్డయ్యేలా ఏర్పాటు చేశారు. ప్రతి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలను జీవీఎంసీ, నగర పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
● కౌంటింగ్ మొదలయ్యే వరకు భద్రతను పర్యవేక్షించే పూర్తి బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించారు. ఈ భద్రతా ఏర్పాట్లపై ఏడీసీపీ, ఏసీపీలు నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.
● ఈ నెల 3న జరగనున్న మహా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా జీవీఎంసీ అధికారులు, నగర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
● నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదివారం రాత్రి స్ట్రాంగ్ రూమ్ కేంద్రాల్ని పర్యవేక్షించారు. మూడంచెల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి
ఏయూలో ఏర్పాటు చేసిన 113 కౌంటింగ్ హాళ్లలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఇందుకోసం 1,507 కౌంటింగ్ టేబుళ్లు, సుమారు 5,000 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. గరిష్టంగా రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో ఒకవైపు మేయర్ పదవికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, మరోవైపు వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతామన్నారు. ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు.


