పేరున్న హోటళ్లలోనూ నిల్వ ఆహారం | - | Sakshi
Sakshi News home page

పేరున్న హోటళ్లలోనూ నిల్వ ఆహారం

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

● ఫుడ్‌సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు ● పలు హోటళ్లకు జరిమానా ● తీరుమారని ‘కామత్‌’

బీచ్‌రోడ్డు: నగరంలో కల్తీ, నిల్వ ఆహార పదార్థాల విక్రయాలపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర డ్రగ్స్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం డైరెక్టర్‌ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో అధికారులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పేరున్న హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడటం కలకలం రేపింది. తనిఖీలు నిర్వహించిన పలు హోటళ్లలో నిల్వ ఉంచిన, నాణ్యత కోల్పోయిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఎప్పుడు తనిఖీలు చేసినా అధిక శాతం హోటళ్లు, రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు బయటపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

కామత్‌ హోటల్‌లో 60 కిలోల నిల్వ చికెన్‌

నగరంలోని ప్రముఖ కామత్‌ హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన 60 కిలోల చికెన్‌ను గుర్తించారు. అది చెడిపోయి దు ర్వాసన వస్తున్నట్లు గుర్తించి, ఆ చికెన్‌ను ధ్వంసం చేశారు. వంట గదిని సీజ్‌ చేసి నోటీసులు జారీ చేశారు.

పిస్తా హౌస్‌లో 30 కిలోల నిల్వ చికెన్‌

పిస్తా హౌస్‌లోనూ 30 కిలోల నిల్వ చికెన్‌ను అధికారులు గుర్తించారు. ఆహార నిల్వ నిబంధనలు పాటించకపోవడం, ఫుడ్‌ సేఫ్టీ ప్రమాణాల ఉల్లంఘనలపై కేసు నమోదు చేశారు.

ఆల్ఫా, ఈస్టర్న్‌ స్టార్‌లలోనూ ఉల్లంఘనలు

జగదాంబ సెంటర్‌లోని ఆల్ఫా హోటల్‌లో వంట గది అపరిశుభ్రంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. బొద్దింకలు, చెత్త మధ్య వంటలు చేస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. ఈస్టర్న్‌ స్టార్‌ రెస్టారెంట్‌లోనూ ఆహార నాణ్యత, వంట గది పరిశుభ్రతలో లోపాలను గుర్తించి కేసు నమోదు చేశారు.

నాణ్యత పట్టని ‘కామత్‌’

కామత్‌ హోటల్‌లో గతంలోనూ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా మరోసారి నిల్వ చికెన్‌ బయటపడటంతో హోటల్‌ నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై నోటీసులు, జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేరున్న హోటల్‌ అని నమ్మి వెళ్తే నాణ్యత లేని ఆహారం అందించడం ఆందోళన కలిగించే విషయం. పదేపదే ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

వాయుపుత్ర రెస్టారెంట్‌లో 28 కిలోల నిల్వ ఆహారం

ఎంవీపీ కాలనీ సెక్టార్‌–8లోని వాయుపుత్ర టిఫిన్స్‌ అండ్‌ మీల్స్‌ రెస్టారెంట్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో కిచెన్‌లో నిల్వ ఉంచిన సుమారు 28 కిలోల పాడైన, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితం తయారుచేసిన కూరలు, పాడైన చట్నీలు, నిల్వ పిండివంటలను అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. రూ.18,860 విలువైన ఆహారాన్ని ధ్వంసం చేసి, రెస్టారెంట్‌ కిచెన్‌ను సీజ్‌ చేశారు.

తనిఖీలు చేస్తున్న ఆధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement