గోల్డ్‌ లోన్‌ టేకోవర్‌ పేరిట బురిడీ | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌ టేకోవర్‌ పేరిట బురిడీ

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

● తాకట్టు బంగారం విడిపిస్తానంటూ పలువురి నుంచి నగదు వసూలు ● మహిళ, భర్త, ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌పై ఫిర్యాదు

సీతంపేట: గోల్డ్‌లోన్‌ టేకోవర్‌ పేరుతో పలువురిని మోసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు నగదు ఇస్తే.. దాన్ని తిరిగి తమ వద్దే తాకట్టు పెట్టుకోవచ్చంటూ బమ్మిడి ఝాన్సీ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఇలా సుమారు రూ.కోటి వరకు వసూలు చేసి ఆమె పరారైనట్లు తెలిపారు. బాధితులు ఫోర్త్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. అక్కయ్యపాలెం మెయిన్‌రోడ్డులోని సయాన్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితులు వివరాలు వెల్లడించారు. సయాన్‌ ఫైనాన్స్‌ నిర్వాహకుడు డి.సురేష్‌ను రెండ్రోజుల క్రితం ఝాన్సీ, ఆమె భర్త శివకుమార్‌ సంప్రదించినట్లు తెలిపారు. అక్కయ్యపాలెంలోని ఐఐఎఫ్‌ఎల్‌లో బంగారం తాకట్టు పెట్టానని, వడ్డీ పెరుగుతున్నందున దాన్ని విడిపించేందుకు రూ.9.53 లక్షలు అవసరమని ఝాన్సీ కోరినట్లు చెప్పారు. దీంతో సురేష్‌ తన వద్ద పనిచేసే శివను ఐఐఎఫ్‌ఎల్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సాయివర్మను సంప్రదించేందుకు పంపించారు. ఝాన్సీ ఖాతాలో నగదు జమ చేస్తే బంగారం అప్పగిస్తామని సాయివర్మ చెప్పడంతో సురేష్‌ డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. అయితే నగదు క్రెడిట్‌ కాలేదంటూ బంగారం ఇవ్వకుండా జాప్యం చేశారని ఆరోపించారు. అనుమానం వచ్చి ఝాన్సీకి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఎంవీపీ కాలనీలో తనకు హనీ రెస్టారెంట్‌ ఉందని ఆమె గతంలో చెప్పడంతో అక్కడికి వెళ్లగా దుకాణం మూసి ఉన్నట్లు గుర్తించారు. ఆధార్‌ ఆధారంగా షీలానగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించామని సురేష్‌ తెలిపారు.

ఒకే తాకట్టుపై పలువురి నుంచి..

సురేష్‌ అక్కడి నుంచి వస్తుండగా మరికొందరు బాధితులు కలిసి తమకూ ఇదే విధంగా మోసం జరిగిందని చెప్పినట్లు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. టి.శ్రీవల్లి నుంచి రూ.15 లక్షలు, నారా బాపి ఈశ్వర్‌ నుంచి రూ.9.5 లక్షలు, రాలి వెంకట నారాయణ నుంచి రూ.9.52 లక్షలు, గంటా సోమేశ్వరరావు నుంచి రూ.18 లక్షలు, చుక్కా శివ నుంచి రూ.9.53 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు చూపించారు. ఒకే తాకట్టు బంగారాన్ని విడిపిస్తానంటూ పలువురి నుంచి ఝాన్సీ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఐఐఎఫ్‌ఎల్‌ మేనేజర్‌ సాయివర్మ, ఝాన్సీ భర్త శివకుమార్‌ పాత్ర కూడా ఉందని వారు పేర్కొన్నారు. సాయివర్మ ఇచ్చిన సమాచారంతోనే తాము డబ్బులు ఇచ్చామని తెలిపారు. బాధితులంతా ఫోర్త్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఝాన్సీ, ఆమె భర్త శివకుమార్‌, ఐఐఎఫ్‌ఎల్‌ మేనేజర్‌ సాయివర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోల్డ్‌లోన్‌ టేకోవర్‌ పేరుతో జరిగే లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సురేష్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement