అల్లిపురం/డాబాగార్డెన్స్: ప్రయాణికులకు పోలీస్ సేవలను మరింత సులభతరం, పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు రైల్వే స్టేషన్, ద్వారకా బస్‌స్టేషన్‌లో డిజిటల్ ఈ–ఫిర్యాదుల కియాస్క్‌లను శనివారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘మీ పోలీస్.. మీ ఫ్రెండ్’ డిజిటల్ ఈ–ఫిర్యాదుల కియాస్క్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించగా.. ద్వారకా బస్‌స్టేషన్ ప్లాట్‌ఫాం నంబరు–22 వద్ద పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఏర్పాటు చేసిన కియాస్క్‌ను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో వారి సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు, ప్రజలు కియాస్క్‌ల ద్వారా తమ ఫిర్యా దులను నమోదు చేసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వాయిస్ ఆధారితంగా ఫిర్యాదులు నమోదు చేసే సదుపాయం కల్పించారు. కియాస్క్‌ల ద్వారా నమోదు చేసిన ఫిర్యాదులకు రశీదు అందజేస్తారు. ఈ–ఫిర్యాదుల కియాస్క్‌లను పీజీఆర్‌ఎస్‌కు అనుసంధానం చేయడంతో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార ప్రక్రి యను పారదర్శకంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. కార్యక్రమాల్లో డీసీపీలు మణికంఠ, మేరీ ప్రశాంతి, మధు, పాపారావు, ఏడీసీపీ నరసింహారావు, జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ఏపీఎస్‌ఆర్‌టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్, ద్వారకా బస్‌స్టేషన్‌లో డిజిటల్ ఈ–ఫిర్యాదుల కియాస్క్‌లు ప్రారంభం


