ఆనందపురం: మండలంలోని వెల్లంకి గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురైన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందక పంచాయతీ జగన్నాధపురానికి చెందిన రెల్లి రవి (26) వెల్లంకి సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విధులు నిర్వహించిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్లంకి గ్రామంలో విద్యుత్ సమస్య తలెత్తడంతో స్తంభం ఎక్కి వైర్ మార్చాల్సిందిగా సమాచారం అందింది. దీంతో రవి అక్కడికి చేరుకుని స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టారు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్ చేయడంతో రవి విద్యుత్ షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడిపోయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే సమీపంలోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రవి మృతి చెందారు. మృతుడికి భార్య ఊహ, మూడేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. రవి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


