పనులు బంద్.. నిధి పోర్టల్ విధానాన్ని సడలించాలని డిమాండ్
ఏకపక్ష ప్యాకేజీ టెండర్లపై తీవ్ర అభ్యంతరం
ఒకే ప్యాకేజీ పద్ధతిలో టెండర్లు పిలిచే విధానంపై అభ్యంతరం
డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. అభివృద్ధి పనులన్నీ నిలిపివేసి నిరసనకు శ్రీకారం చుట్టారు. డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి పనులకు స్వస్తి పలికారు.
ముందస్తు హెచ్చరికలు బేఖాతరు
జీవీఎంసీలో ఎన్నడూ లేని విధంగా సాధారణ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలనే నిబంధన పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి, భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి బిల్లుల ప్రాసెసింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని 2027 జనవరి 1 వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నింటినీ సాధారణ నిధుల ద్వారా వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 25లోగా స్పందించాలని ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, పురపాలక శాఖ మంత్రికి, జీవీఎంసీ కమిషనర్‌తో పాటు విశాఖ ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులకు ముందే వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఎటువంటి స్పందన రాకపోవడంతో చేసేది లేక కాంట్రాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.
ఒకే ప్యాకేజీ టెండర్లపై మండిపాటు
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సంయుక్తంగా భారీ మొత్తాలతో అభివృద్ధి పనులను ఒకే ప్యాకేజీ పద్ధతిలో టెండర్లు పిలుస్తుండటంపై కాంట్రాక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తాలతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవడం వల్ల చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు పనుల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల స్థానిక కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు కూడా భాగస్వామ్యం కల్పించేలా పనులను విభజించి టెండర్లు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీ విగ్ర హానికి నివాళులు.. నిరసన
సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో సమావేశమైన కాంట్రాక్టర్లు.. జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, రాజాన వెంకటరమణ, వీరారెడ్డి, జి.సింహాచలం, ఎం.రమేష్, శ్రీనివాసరావు, అప్పలరాజు, గొంప చంద్రమౌళి, షేక్ సిలార్, కోటేశ్వరరావు, రవికుమార్, అప్పలనాయుడు, సాదూరావు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.


