మహారాణిపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణ, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. నెలవారీగా జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలపై ఆడిట్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై బ్లాక్‌స్పాట్లను తగ్గించడంతోపాటు అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలో ప్రతిపాదించిన పనులను వేగంగా పూర్తి చేయాలని, ఆర్థికేతర పనులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. నగరంలో పనిచేయని 11 సిగ్నల్స్‌లో ఆరు సిగ్నల్స్ పనులు కొనసాగుతున్నాయని, మిగిలినవి ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఆనందపురం పూల మార్కెట్‌ను తరలించేందుకు భీమిలి ఆర్డీవో, వీఎంఆర్‌డీఏ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని, బస్సులు, డ్రైవర్లను తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, రవాణా శాఖ అధికారి విజయ్‌ప్రకాశ్, ఎంవీఐలు, పోలీసు, జీవీఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్‌ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.


