● నెలకు రూ.6 లక్షలు వచ్చే బిర్యానీ పాయింట్లు కాజేసిన ఎమ్మెల్యే అనుచరులు ● ఈ సెటిల్‌మెంట్‌ దందాలో చేతులు కలిపిన టీడీపీ మాజీ కార్పొరేటర్‌ ● ఉపాధి కోల్పోవడంతో రగిలిపోయిన సాయి ● బీహార్‌లో గన్‌ కొనుగోలు.. మూడు రౌండ్లు కాల్చి ప్రాక్టీస్‌ | - | Sakshi
Sakshi News home page

● నెలకు రూ.6 లక్షలు వచ్చే బిర్యానీ పాయింట్లు కాజేసిన ఎమ్మెల్యే అనుచరులు ● ఈ సెటిల్‌మెంట్‌ దందాలో చేతులు కలిపిన టీడీపీ మాజీ కార్పొరేటర్‌ ● ఉపాధి కోల్పోవడంతో రగిలిపోయిన సాయి ● బీహార్‌లో గన్‌ కొనుగోలు.. మూడు రౌండ్లు కాల్చి ప్రాక్టీస్‌

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

ప్రశాంత విశాఖ నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. అది ఎంతగానంటే.. బిహార్‌ నుంచి గన్‌ కొనుగోలు చేసి మరీ.. కాల్పులు జరిపేంత! తాజాగా నగరంలో కలకలం రేపిన జనసేన నేతపై గన్‌ కాల్పుల వ్యవహారంలో.. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి కడుపు మంటే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా బయటపడుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

రెండు బిర్యానీ పాయింట్ల వ్యవహారంలో మొదలైన పంచాయితీ.. ఓ వ్యక్తి కడుపు మంటకు కారణమయింది. ఆర్థిక నష్టం కాస్తా.. కక్షగా మారి గన్‌ కాల్పుల దాకా వెళ్లింది. ప్రతి నెలా రూ.6 లక్షల లాభాన్ని తెచ్చిపెట్టే తన వ్యాపారాన్ని బలవంతంగా లాక్కోవడమే ఎమ్మెల్యే అనుచరుడు మద్ది రాజశేఖరరెడ్డిపై గునుకుల సాయినారాయణ గన్‌ కాల్పులకు తెగబడేందుకు దారి తీసింది. బిర్యానీ పాయింట్ల విషయంలో జరిగిన ప్రైవేటు పంచాయితీనే ఈ ఘటనకు మూలమని దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సాయి నారాయణతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

రూ.20 వేల రోజువారీ ఆదాయంపై కన్ను?

విశాఖ సౌత్‌ జైల్‌ రోడ్‌ పరిధిలో నరేంద్ర, సాయినారాయణ కలిసి రెండు బిర్యానీ పాయింట్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారం బాగుండటంతో ఒక్కో పాయింట్‌ నుంచి రోజుకు సుమారు రూ.10 వేల చొప్పున నెలకు రూ.6 లక్షల ఆదాయం వచ్చేది. దీంతో వీటిపై సదరు ఎమ్మెల్యే అనుచరుడి కన్ను పడింది. ఈ క్రమంలో మొదట టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ వద్ద పంచాయితీ జరిగింది. చెరో బిర్యానీ పాయింట్‌ తీసుకోవాలని సూచించినా వినకపోవడంతో.. ఎమ్మెల్యే కీలక అనుచరుడి దగ్గరకు పంచాయితీ వెళ్లింది. రూ.10 లక్షలు డీడీ తీసుకుని రెండు బిర్యానీ పాయింట్లను రాజశేఖరెడ్డికి వదిలి వెళ్లిపోవాలంటూ సాయిని హెచ్చరించారు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రాజీకి ఒప్పించి, తీవ్ర ఆర్థిక నష్టానికి కారణమైన రాజశేఖర్‌రెడ్డిపై సాయి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.

మూడున్నర నెలలు...మూడు రౌండ్ల ట్రయల్‌...!

నాలుగు నెలల క్రితం ఈ ప్రైవేట్‌ పంచాయితీ జరిగింది. మూడున్నర నెలల నుంచి అక్రమ ఆయుధ కొనుగోలుకు సాయి ప్రయత్నించాడు. బిహార్‌కు వెళ్లి మరీ గన్‌ కొనుగోలు చేశాడు. బిహార్‌లో ఎక్కడెక్కడ గన్స్‌ విక్రయిస్తారో తెలుసుకుంటూ గల్లీగల్లీ తిరిగి మరీ ఓ వ్యక్తిని కలిశాడు. సదరు వ్యక్తి సాయి కళ్లకు గంతలు కట్టి, అక్రమ ఆయుధాల కారాగారం వద్దకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు చెల్లించి 7.65 ఎంఎం సైజ్‌ గన్‌, పది రౌండ్ల బుల్లెట్లు కొనుగోలుచేశాడు. అక్కడే మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చి మరీ కాల్పులు జరిపేందుకు ట్రయల్‌ వేశాడు. మిగిలిన బుల్లెట్లతో పాటు గన్‌ తీసుకుని విశాఖ చేరుకున్నాడు.

సౌండ్‌ వచ్చింది.. బుల్లెట్‌ రాలేదు

దాడికి రెక్కీ నిర్వహించాడు. ఈ నెల 12న రాత్రి 11:30 నుంచి 12 గంటల సమయంలో నీలమ్మ వేపచెట్టుకు సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా రాజశేఖర్‌రెడ్డి తన బైక్‌ అపి దిగేటపుడు కాల్పులు జరిపాడు. తుపాకీ నుంచి శబ్దం వచ్చినా.. గుండు పేలనట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన రాజశేఖర్‌ పెద్దగా కేకలు వేయడంతో... అక్కడి నుంచి సాయి బైక్‌ మీద పరారయ్యాడు.

కానిస్టేబుల్‌కు తెలిసినా..

రాజశేఖరరెడ్డి గతంలో హోంగార్డుగా పనిచేశాడు. స్థానిక స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు తనపై దాడి సమాచారం అందించాడు. ఫిర్యాదు మాత్రం చేయలేదు. సదరు కానిస్టేబుల్‌ కూడా ఈ కాల్పుల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం. చివరకు ఘటన జరిగిన 9 రోజుల తర్వాత తనకు ప్రాణ హాని ఉందని భావించి రాజశేఖర్‌ ఈ నెల 21 న టూ టౌన్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు. విశాఖ సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు... గొల్లల పాలెంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కాల్పులకు తెగబడ్డ సాయితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనపై ముందే సమాచారం ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లని కానిస్టేబుల్‌ను కనీసం హెచ్చరించకపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైన ప్రైవేట్‌ పంచాయితీ చేసిన మాజీ కార్పొరేటర్‌తో పాటు ఎమ్మెల్యే కీలక అనుచరుడి జోలికి మాత్రం పోలీసులు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement