తీవ్ర వాయుగుండంపై జీవీఎంసీ అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

తీవ్ర వాయుగుండంపై జీవీఎంసీ అప్రమత్తం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యం 56 ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం సిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌, జోనల్‌ కంట్రోల్‌ రూమ్‌ల పర్యవేక్షణ కొండవాలు, లోతట్టు, ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా జిల్లా కలక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌

అల్లిపురం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుతో కలిసి కై లాసపురం కస్తూరి నగర్‌లో కొండచరియలు జారిన ప్రాంతాన్ని కలెక్టర్‌, కమిషనర్‌ బుధవారం పరిశీలించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కస్తూరి నగర్‌లోని 8 కుటుంబాలను ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌, అన్ని జోనల్‌ కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. నగర వ్యాప్తంగా 98 క్షేత్ర స్థాయి బృందాలను అందుబాటులో ఉంచారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 43 ఫిర్యాదులు, సంఘటనలు నమోదు కాగా వాటిలో 41 ఫిర్యాదులు పరిష్కరించారు. వీటిలో చెట్లు కూలిన ఘటనలు 36, నీరు నిలిచిన ఫిర్యాదులు 3, కాలువలు పొంగిన ఘటనలు 4 ఉన్నాయి.

అత్యవసర సహాయక చర్యల కోసం 22 జేసీబీలు, 149 టిప్పర్లు, టాటా ఏస్‌ వాహనాలు, 30 మినీ ఎక్స్‌కవేటర్లు సిద్ధంగా ఉంచారు. చెట్లు, హోర్డింగులు, విద్యుత్‌ స్తంభాలు కూలడం, కాలువలు పొంగడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలపై తక్షణమే స్పందించేలా అన్ని విభాగాల సిబ్బందిని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు. పోలీస్‌, అగ్నిమాపక, ఈపీడీసీఎల్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, బలహీన భవనాలు, కొండవాలు ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం జీవీఎంసీ టోల్‌ఫ్రీ 1800 4250 0009, వాట్సాప్‌ 9014218870 నంబర్లలో తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement