మహారాణిపేట: ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 5,74,496 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత పిల్లలకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 25న మాత్రలు తీసుకోలేని వారికి అక్టోబరు 5న నిర్వహించే మాప్‌అప్ రౌండ్‌లో అందించాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్. రమేష్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్, డాక్టర్ బి. హారిక, ఎస్‌డీసీ గోవిందు, డీఈవో ప్రేమకుమార్ తదితరులు పాల్గొన్నారు.


