ఐటీ హిల్..
రుషికొండ ఐటీ హిల్స్
సాక్షి, విశాఖపట్నం: ఉదయం లేచింది మొదలు.. ఐటీ రంగం అభివృద్ధి గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రభుత్వం అసలు వైఖరి బయటపడింది. విశాఖలోని రుషికొండ ఐటీ హిల్స్‌లో దాహం కేకలు వినిపిస్తున్నా.. ప్రభుత్వం చెవికి సోకడం లేదు. ఏపీఐఐసీ హిల్ నం.2,3లో ఉన్న ఐటీ కంపెనీలు చుక్క నీరు లేక విలవిల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా అడుగంటిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 5,000 మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఐటీ పరిశ్రమలకు నెలకు 6.5 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం కేవలం 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా అవుతుండటంతో పరిస్థితి దయనీయంగా మారింది. సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం కనీస స్థాయిలో పట్టించుకోకపోవడం సర్కారు చేతకానితనానికి అద్దం పడుతోంది.
పొదుపుగా వాడుకోవాలంటూ నోటీసులు
రుషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దాదాపు 15 ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి వినియోగం భారీగా పెరిగి, భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. దీంతో అక్కడ పరిస్థితి మరింత దిగజారింది. పంపింగ్ మోటార్లను రోజుకు 12 నుంచి 15 గంటల పాటు నిరంతరాయంగా నడిపిస్తున్నప్పటికీ, డిమాండ్‌కు తగ్గ నీరు అందడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించలేమంటూ ఏపీఐఐసీ చేతులెత్తేసింది. నీటిని అత్యవసరాలకే వాడుకోవాలని.. పొదుపుగా వినియోగించాలంటూ ఐటీ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంది.
అడుగంటిన భూగర్భ జలాలు
రెండు హిల్స్‌లో నీటి వినియోగం సుమారు 4.5 ఎంఎల్‌డీగా ఉండేది. ప్రస్తుతం ఈ నీటి వినియోగం 6.2 ఎంఎల్‌డీలకు పెరిగింది. కానీ, ఉన్న బోరుబావుల్లో నీటి ఊట దారుణంగా పడిపోవడంతో పంపింగ్ సామర్థ్యం తగ్గిపోయింది. రుషికొండ ప్రాంతాల్లో గతేడాది సెప్టెంబర్‌లో 22 అడుగులకు భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది ఏకంగా 80 నుంచి 90 అడుగులకు పడిపోయాయి. దీంతో మోటర్లకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. 250 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్తే తప్ప నీరు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు.
సమస్య చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం
నీటి కొరతను తీర్చడంలోనూ.. ముందస్తు ప్రణాళికలు రచించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ సంస్థలకు కనీస అవసరమైన నీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనడానికి తాజా గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. నీటి కొరత వేధిస్తోందంటూ పలు ఐటీ కంపెనీలు కొద్ది రోజులుగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా.. పొదుపు చేయాలని నోటీసులివ్వడంపై ఐటీ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హెచ్చరికలతో ఆదరాబాదరాగా..
ఇలాగైతే ఇక్కడ పనిచేయలేమని కొన్ని సంస్థలు ప్రభుత్వ పెద్దలకు నేరుగా తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లూ నిద్ర నటించిన ప్రభుత్వం ఇప్పుడు హడావుడి మొదలు పెట్టింది. ప్రస్తుతం ఉన్న సరఫరాకు అదనంగా మరో వనరును సమకూర్చేందుకు ఏర్పాట్లు చేయాలంటూ ఏపీఐఐసీని ఆదేశించింది.ఐటీ హిల్స్ సమీపంలో ఉన్న కృష్ణా మినీప్లెక్స్ సమీపంలోని రెండు బోరుబావుల్లో నీరు పడుతున్నప్పటికీ, అక్కడ తక్కువ సామర్థ్యం గల మోటార్లు ఉన్నాయి. వాటి స్థానంలో అధిక సామర్థ్యం గల మోటార్లను బిగించి, అక్కడి నుంచి హిల్ నం.3 సంప్‌కు పైప్‌లైన్ వేయాలని ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడింది. దీంతో పాటు హిల్ నం.2,3 కోసం కొత్త వాటర్ సప్లై ప్లాన్‌ను కూడా రూపొందిస్తోంది.కొద్ది రోజులుగా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇన్ని ఇబ్బందులు పడుతూ ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకున్నా, అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి.. ఇప్పుడు హడావుడి చేస్తుండటంపై మండిపడుతున్నారు.
రుషికొండ ఐటీ హిల్స్‌లో దాహం కేకలు
ఐటీ కంపెనీల ప్రాంతంలో అడుగంటిన భూగర్భ జలాలు
దారుణంగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్
ఐటీ పరిశ్రమలకు నెలకు 6.5 మిలియన్ లీటర్లు అవసరం
ప్రస్తుతం 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా
నీరు లేక అవస్థలు పడుతున్న 5 వేల మంది ఐటీ ఉద్యోగులు
నీటిని పొదుపుగా వాడాలంటూ ఐటీ సంస్థలకు నోటీసులిచ్చిన ఏపీఐఐసీ
సమస్య విన్నవించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఇదేనా మీ విజనరీ చంద్రబాబూ.?
ప్రత్యామ్నాయ మార్గాలు పూర్తయ్యే సరికి మరో 50 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఐటీ కంపెనీలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిందేనన్నది స్పష్టమవుతోంది.
ఐటీ రంగంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాననీ.. విశాఖను ఐటీ హబ్‌గా చేసేస్తానంటూ పదేపదే చంద్రబాబు, లోకేష్ బీరాలు పలికారు. ఇప్పుడు కనీసం అక్కడ పనిచేసే ఉద్యోగులకు గుక్కెడు నీరు అందించలేని స్థితిలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.ఇదే నిర్లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైతే.. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయి విశాఖ ఐటీ రంగం కుదేలవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


