బలమైన అభ్యర్థులను ఎంపిక చేద్దాం
వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్
కురసాల కన్నబాబు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహ సమావేశం
సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికల్లో బలమైన, ఆమోదయోగ్యమైన అభ్యర్థులను వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దించాలని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో నిజాయతీగా నిలబడిన కార్యకర్తలు, నాయకులను అభినందించారు. ఆదివారం మాధవదారలోని వుడాకాలనీలో ఉన్న గ్రాండ్ మిలాన్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరయ్యారు. కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నగరంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై పోరాటాలు చేపట్టాలని తెలిపారు. స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, ప్రతి డివిజన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చర్చించి బలమైన అభ్యర్థుల జాబితాను రూపొందించాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభు త్వ విధానాలపై పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం పార్టీ నాయకులకు ఐడీ కార్డులు అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్లను తీసుకుని, అందరితో చర్చించి పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులను ఫోన్ చేసి బెదిరించడం, పోటీ చేస్తే ఇది చేస్తాం.. అది చేస్తామని భయపెట్టడం వంటి చర్యలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే 30 రోజుల్లో వార్డు సమావేశాల షెడ్యూల్ సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ, బాణాల శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ప్రచార విభాగం జోన్–1 ప్రెసిడెంట్ రవి రాజు, మాజీ కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, అల్లు శంకర్ రావు, కె.అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, మువ్వల పోలారావు, వావిలపల్లి ప్రసాద్, సేనాపతి అప్పారావు, పామోటి బాబ్జి, భర్కత్ అలీ, కేవీఎన్ శిశికళ, జీవీ రమణి, దల్లి రామక్రిష్ణరెడ్డి, వార్డు అధ్యక్షులు పైడి రమణ, గుజ్జు వెంకటరెడ్డి, బల్ల శ్రీనివాసరావు, బొడ్డేటి కిరణ్, భీశెట్టి ప్రసాద్, జక్కంపూడి సత్యనారా యణ, హాబీబ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, డోప్ప శ్రీను, ఐ.రవికుమార్, వేణు, మెట్ట దమయంతి, కడితి చిరంజీవి, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర, జోనల్, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.


