హైదరాబాద్ పోచారంలో ఘటన
భర్త వేధింపులే కారణమంటూ
కుటుంబ సభ్యుల ఆరోపణలు
మృతికి గల కారణాలపై
పోలీసుల దర్యాప్తు
పోచారం (హైదరాబాద్): సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో అత్మహత్యకు పాల్పడటం పోచారం ఐటీ కారిడార్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన కే. మౌనిక సంతోషి (28) పోచారం ఐటీ కారిడార్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి 8 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్ సమీపంలోని గ్యాలాక్సీ టవర్స్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల వయస్సు గల మగ కవల పిల్లలు ఉన్నారు. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ హెచ్‌ఆర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండటంతో పని మహిళ ఇంట్లోకి వచ్చి చూడగా మౌనిక ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం రాత్రే ఈ ఘటన జరిగి ఉండొచ్చని, ఆ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


