బీచ్‌రోడ్డు: నగరంలోని రామ్‌నగర్ లయన్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన భారతీయ పురాతన కరెన్సీ, అంతర్జాతీయ నాణేలు, నోట్లు, తపాలా స్టాంపుల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో భారతీయ కరెన్సీతో పాటు ప్రపంచంలోని సుమారు 200 దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, తపాలా స్టాంపులను ప్రదర్శనకు ఉంచారు. రాజుల కాలం నాటి రాగి, వెండి నాణేలు, బ్రిటిష్ కాలం నాటి కరెన్సీ, స్వాతంత్య్రం అనంతరం విడుదలైన తొలి నోట్లతో పాటు ప్రపంచంలోనే అతి చిన్న నాణెం నుంచి అతిపెద్ద నాణెం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో చారిత్రక అవగాహనతో పాటు సేకరణపై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించి భారత కరెన్సీ చరిత్రతో పాటు ప్రపంచ దేశాల కరెన్సీ విశిష్టతను తెలుసుకోవాలని కోరారు.పాఠ్యపుస్తకాల్లో చదివిన చరిత్రను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.


