673, 975 జీవోలను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

673, 975 జీవోలను రద్దు చేయాలి

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

బీచ్‌రోడ్డు: మున్సిపల్‌ కార్మికుల ఉపాధికి గొడ్డలిపెట్టుగా మారిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పి. వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల ఆదాయాలు పెంచేలా పాలన సాగిస్తోందే తప్ప, సామాన్య ప్రజలు, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గతంలో కార్మిక వ్యతిరేక జీవో 279ని తీసుకొచ్చినందుకే ఆనాడు చంద్రబాబు నాయుడిని కార్మికులు గద్దె దించారని గుర్తుచేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఆదాయాలను ప్రభుత్వం తన వైపు తిప్పుకుంటోందే తప్ప, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం లేదన్నారు. ఇప్పటికే వీధిలైట్ల నిర్వహణను ప్రైవేటుపరం చేసి, ఆ కాంట్రాక్టులను తమ అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్‌ కార్మికులందరికీ ‘మినిమం టైమ్‌ స్కేల్‌’ అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మాట తప్పి ప్రైవేటీకరణ పేరిట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

యూనియన్‌ అధ్యక్షుడు టి.నూకరాజు మాట్లాడుతూ ‘స్వచ్ఛ సర్వేక్షన్‌’లో నగరానికి ఉత్తమ ర్యాంకులు రావడానికి, పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి మున్సిపల్‌ కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. అలాంటి కార్మికులను పర్మినెంట్‌ చేయాల్సింది పోయి, ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గొలగాని అప్పారావు, జె. నాయుడు, కె. వెంకట్రావు, జి. రమణ, సీహెచ్‌. రాజు, ఎం.వి. ప్రసాద్‌, పి. అప్పలరాజు, ఎన్‌. నాగరాజు, కె.ఎస్‌. బాలు, ఇ. ఆదినారాయణ, జి. రాము తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement