తాటిచెట్లపాలెం: రైల్వే ఉద్యోగులకు మరింత మెరుగైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలందించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈమేరకు సెంట్రల్ బ్యాంక్.. సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం డివిజన్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు సౌకర్యవంతమైన ఉద్యోగి కేంద్రిత ఆర్థిక సేవలు అందించడంలో ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగకరమన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా రైల్వే ఉద్యోగులకు ఆర్థిక భద్రత, బ్యాంకింగ్ సేవలపై మరింత అవగాహన కల్పించడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా డిపాజిట్లు, రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ తదితర సేవలను సులభంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారీ.. సెంట్రల్ బ్యాంక్ విశాఖపట్నం రీజన్ రీజనల్ హెడ్ వి.కృష్ణమోహన్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఇరు సంస్థల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


