సీతంపేట: అధికారిక భాష అయిన హిందీ అమలులో అత్యుత్తమ కృషికి 2025–26 సంవత్సరానికి ‘రాజభాషా కీర్తి’ ప్రథమ పురస్కారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దక్కింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ రాజభాషా విభాగం ఆధ్వర్యంలో నవీ ముంబైలో నిర్వహించిన అఖిల భారత రాజభాషా సదస్సులో ఈ పురస్కారాన్ని అందించారు. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కల్యాణ్ కుమార్ ఈ అవార్డును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా స్వీకరించారు. అధికారిక భాష అమలు, హిందీ భాష ప్రోత్సాహం, రాజభాషా విధానంపై బ్యాంకు కొనసాగిస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ద్విభాషా అంతర్గత పత్రిక ‘సెంట్రలైట్’ వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూపొందించిన ‘హెరిటేజ్ ఎడిషన్’ను రాజభాషా శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, బండి సంజయ్ కుమార్, రాజభాషా విభాగం కార్యదర్శి అంషులీ ఆర్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేంద్ర దోహారే, చీఫ్ జనరల్ మేనేజర్ రాజభాషా కుశాల్ పాల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజభాషా హితేంద్ర ధుమాల్, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న రాజభాషా అధికారులు పాల్గొన్నారు.


