ఈ నెల 19న చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఈ ముసుగులో కూటమి నేతల స్వాహా పర్వం క్రమబద్ధీకరణ జాబితాలో పేరుండాలంటే ముడుపు చెల్లించాల్సిందే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ పేదల నుంచి కప్పం వసూళ్లు 2014లో ఇచ్చిన పట్టాలే మళ్లీ పంపిణీ చేస్తున్న టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: పేదలకు గూడు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అదే పేదల నెత్తిన పెద్ద టోపీ పెడుతోంది. ‘పట్టా’ల పంపిణీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారార్భాటానికి తెరలేపిన చంద్రబాబు సర్కారు.. పాత పట్టాలనే పాలిష్ చేసి మళ్లీ పంచుతూ ప్రజలను దారుణంగా మోసం చేస్తోంది. ఇదే అదనుగా.. టీడీపీ నేతలు అందినకాడికి దోచుకునే స్వాహా పర్వానికి తెరతీశారు. 19న నగరంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనున్న పట్టాల పంపిణీ కార్యక్రమం.. స్థానిక చోటా, బడా నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. క్రమబద్ధీకరణ జాబితాలో పేరుండాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనని అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేస్తుండటంతో.. పేదల నుంచి ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ కప్పం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు పాత పట్టాలకే కొత్త రంగులు అద్దుతూ పత్రికల్లో, టీవీల్లో ఊదరగొడుతూ ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు పేదల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న పచ్చ నేతల ‘బడా దందా’ ఇప్పుడు సర్వత్రా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ.!
ఓ సినిమాలో విలన్ చెప్పిన ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ..’ అనే సామెత ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పైకి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, విశాఖ జిల్లాలో ఒకేరోజు 25,880 కుటుంబాలకు హక్కులు కల్పిస్తున్నామంటూ ప్రచారం చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ.. కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వనున్నట్లు ఊదరగొడుతున్నారు. కానీ, 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలకు ఇప్పుడు మళ్లీ మురిపెం పేరుతో పంపిణీ చేయడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న పట్టాల్లో 80 శాతం వరకూ పాతవే కావడం గమనార్హం.
పట్టా కావాలంటే పైసా చెల్లించాల్సిందే.!
ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు హక్కులను కల్పించేలా వివిధ రకాల జీవోల అమలు ముసుగులో టీడీపీ, జనసేన నేతలు భారీ ఎత్తున అవినీతికి తెరలేపారు. ఒక్క విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 8,074 మందికి, ములగాడ మండలంలో 4,213, గాజువాకలో 3,999, గోపాలపట్నంలో 2,956, పెందుర్తిలో 2,736, పెదగంట్యాడలో 1,694, మహారాణిపేట మండలంలో 1,228 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నామని ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. అయితే, ఈ రెగ్యులరైజేషన్ జాబితాలో అర్హులైన పేదల పేర్లు ఉండాలంటే అధికార పార్టీ నేతలు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ దందాలో కింది స్థాయి చోటా నేతల నుంచి పై స్థాయి బడా నేతల వరకు అందరికీ వాటాలు వెళుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులరైజేషన్ పేరుతో జరుగుతున్న ఈ తంతు అంతా పార్టీ నేతల జేబులు నింపేందుకేనన్నది స్పష్టమవుతోంది. పేదలకు అండగా ఉంటున్నామని బిల్డప్ ఇస్తూ సాగుతున్న ఈ ప్రచారార్భాటం వెనుక ఉన్న దారుణమైన దోపిడీపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సామాన్యులు తోచిన కాడికి సమర్పించేసుకుంటుండటం కొసమెరుపు.


