నవ్వులు పూయాల్సిన ఇంట్లో..
కన్నీటి శోకం
ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో
విశాఖ కుటుంబం చిన్నాభిన్నం
చిన్నారి పుట్టినరోజు వేడుకల మధుర జ్ఞాపకాలు ముగియకముందే విధి పగ
మెల్‌బోర్న్ ఘోర రోడ్డు ప్రమాదంలో
అత్త, కోడలు దుర్మరణం
ఒకే కుటుంబంలో రెండు తరాలు
నేలకూలడంతో సీతమ్మధారలో
విషాద ఛాయలు
అల్లిపురం/విశాఖ స్పోర్ట్స్: నిన్నటి వరకు చిరునవ్వులతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు పెను విషాదం అలుముకుంది. చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పంచుకున్న ఆనందపు కేరింతలు చెరిగిపోకముందే.. విధి ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలోకి నెట్టింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సీతమ్మధారకు చెందిన జి.టి.ప్రసాద్ కుటుంబాన్ని కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది. కేవలం క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటనలో విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) మాజీ జాయింట్ సెక్రటరీ జి.టి.ప్రసాద్ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) ప్రాణాలు కోల్పోవడం నగర క్రీడా, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మనవళ్లను చూడాలన్న ఆశతో వెళ్లి..
విశాఖ షిప్‌యార్డ్‌లో రిటైర్డ్ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా సేవలందించిన జి.టి.ప్రసాద్.. ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులను రంజీ దిశగా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. తన కుమారుడు, కోడలు, మనవళ్లను చూసేందుకు, అక్కడే జరిగే ఒక శుభకార్యంలో పాల్గొనేందుకు ఆయన తన భార్య రమాదేవితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. కుమారుడి కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన ఆ వృద్ధ దంపతుల ప్రయాణం ఇలాంటి విషాదంతో ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు.
మధురజ్ఞాపకాలు మరువకముందే..
వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడున్నరేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే చిన్నారి వివాన్వి మొదటి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో పిల్లలతో కలిసి నేహా ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ, నృత్యం చేస్తూ గడిపిన క్షణాలు ఆ కుటుంబానికి జీవితాంతం పదిలంగా ఉండాల్సిన మధుర జ్ఞాపకాలు. కానీ, ఆ సంతోషం నెల రోజులు కూడా గడవకముందే జరిగిన ఈ ప్రమాదం ఆ పసిబిడ్డలకు అమ్మను, నానమ్మను దూరం చేసింది. తల్లి లేని లోటుతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు చూసేవారి హృదయాలను ద్రవింపజేస్తోంది.
మృతదేహాల రాకకు 10 రోజులు
హిందూ సంప్రదాయాల ప్రకారం మృతదేహాలను విశాఖకు రప్పించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికకాయాలు విశాఖ చేరుకోవడానికి కనీసం 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో అండగా నిలిచేందుకు ఆస్ట్రేలియన్ తెలుగు కమ్యూనిటీ ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. జి.టి.ప్రసాద్ కుటుంబానికి జరిగిన ఈ నష్టం పట్ల వీడీసీఏ ప్రతినిధులు, నగర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
కళ్లెదుటే జరిగిన ఘోరం
మెల్‌బోర్న్‌లోని పాయింట్ కుక్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న టయోటా కొరోలా కారును ఎదురుగా వచ్చిన పోర్షే మెకాన్ కారు తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి, నేహా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కళ్లెదుటే భార్య, తల్లి విగతజీవులుగా మారడాన్ని చూసి కుమారుడు వరుణ్‌చంద్ర గున్నా పడిన వేదన వర్ణనాతీతం. భార్యను, తల్లిని ఒకేసారి కోల్పోయిన ఆయనను ఓదార్చడం ఎవరితరం కాలేదు.


