డీలర్లకు యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

డీలర్లకు యాప్‌సోపాలు

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

క్యూఆర్‌ కోడ్‌తో తంటాలు

బలవంతంగా రుద్దుతున్న

కూటమి ప్రభుత్వం

సాంకేతిక సమస్యతో ఇబ్బందులు

తప్పవంటున్న డీలర్లు

మహారాణిపేట: రేషన్‌ బియ్యం పంపిణీలో పారదర్శకత పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త ‘క్యూఆర్‌ కోడ్‌’ విధానం.. క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాల డీలర్లకు తలనొప్పిగా మారనుంది. జిల్లాలో త్వరలో అమల్లోకి రానున్న ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే జిల్లాకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ డీలర్లు ఇప్పటికే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. జిల్లా పరిధిలోని 625 చౌక ధరల దుకాణాల ద్వారా 5,12,619 తెల్ల రేషన్‌ కార్డుదారులకు సుమారు 8,161 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యంతో పాటు, అంత్యోదయ అన్నయోజన కింద 35 కిలోల బియ్యం, రాయితీపై పంచదార వంటి సరుకులను పంపిణీ చేయాలి. అయితే ఇప్పటివరకు మామూలుగా సాగిన ఈ తంతుకు.. కొత్తగా వచ్చిపడిన క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పెద్ద అడ్డంకిగా మారనుంది. గతంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, ఎఫ్‌సీఐ గోదాముల నుంచి రేషన్‌ షాపులకు సరుకులు చేరడం, డీలర్లు వాటిని తూకాల్లో సర్దుబాటు చేసుకోవడం సాఫీగా జరిగేది. రవాణా సమయంలో బస్తాలు కొద్దిగా చిరిగినా, బరువు తగ్గినా డీలర్లు ఆ నష్టాన్ని సర్దుబాటు చేసుకునేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ 50 కిలోల బియ్యం బస్తాకు ఉండే క్యూఆర్‌ కోడ్‌ను ప్రత్యేక యాప్‌ ద్వారా విధిగా స్కాన్‌ చేయాల్సిందే. ఈ స్కానింగ్‌ పూర్తయి, పీపీఎస్‌ యాప్‌ ద్వారా సబ్మిట్‌ చేసి, ఈ–పాస్‌ ద్వారా ఆర్‌వో జనరేట్‌ అయితేనే హమాలీలు బస్తాలను అన్‌లోడ్‌ చేయడానికి వీలవుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది.

మొరాయిస్తున్న సర్వర్లు

గోదాముల నుంచి తరలించే సమయంలో బస్తాలకు ఉన్న క్యూఆర్‌ కోడ్‌ పేపర్లు చాలాచోట్ల చిరిగిపోతున్నాయి. అలా చిరిగిన వాటిని ఏం చేయాలో తెలియక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇక యాప్‌లో పది బస్తాలను స్కాన్‌ చేస్తే కేవలం నాలుగైదు మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయని, మిగతావాటికి సర్వర్‌ మొరాయించడం లేదా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. మరోవైపు చాలా మంది డీలర్ల వద్ద కనీసం స్మార్ట్‌ఫోన్‌లు కూడా లేవు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆపరేట్‌ చేయాలంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌లు కొనడం, వాటి వాడకంపై అవగాహన పెంచుకోవడం గ్రామీణ ప్రాంతాల డీలర్లకు కత్తిమీద సాములా మారింది. ఒక చిన్న బస్తాను స్కాన్‌ చేయడానికే గంటల తరబడి సమయం వృథా అవుతుండటంతో, నిర్దేశిత గడువులోగా పంపిణీ చేయడం ఎలాగని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఫెయిర్‌ ప్రైస్‌ షాప్‌ డీలర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి.చిట్టిరాజు ఆధ్వర్యంలో డీలర్లు డీఎస్‌వో వి.భాస్కరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్‌లు లేని వృద్ధ డీలర్లు ఈ విధానం వల్ల తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను, డీలర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లాకు ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో రేషన్‌ పంపిణీ ప్రక్రియ మరింతస్తంభించి, కార్డుదారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త సాంకేతిక సంస్కరణలు క్షేత్రస్థాయిలో సామాన్యులకు, డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి? దీన్ని పరిష్కరించడానికి పౌరసరఫరాల శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement