ఉన్నవి దాచి.. ఊడ్చినవి బిగించి! | - | Sakshi
Sakshi News home page

ఉన్నవి దాచి.. ఊడ్చినవి బిగించి!

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

సాక్షి, విశాఖపట్నం: ‘మా సంస్థలో కొత్త మీటర్లు చాలా ఉన్నాయి. కానీ.. అవి ఇప్పుడు వినియోగించం. మా దగ్గర ఉన్న పాతవి వాడిన తర్వాత.. కొత్తవి వాడతాం.’ సాక్షిలో గురువారం ప్రచురితమైన ‘కొత్త మీటర్లు లేవండీ.!’ అనే కథనంపై ఈపీడీసీఎల్‌ అధికారుల స్పందన ఇదీ. మీటర్ల మంజూరు వ్యవహారంలో విద్యుత్‌ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న అలసత్వాన్ని ఎండగడుతూ ప్రచురించిన కథనంపై స్పందించిన ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఇచ్చిన వివరణలో సారాంశం వింటే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సంస్థ పర్చేజెస్‌ సీజీఎం విజయ్‌ప్రతాప్‌ మాట్లాడుతూ.. సంస్థ వద్ద దాదాపు లక్ష కొత్త విద్యుత్‌ మీటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారులకు మాత్రం గతంలో వాడిన పాత మీటర్లనే బిగిస్తున్నామని స్వయంగా అంగీకరించారు. ఈపీడీసీఎల్‌ పరిధిలో మీటర్ల కొరత లేదని.. గురువారం నాటికి సంస్థ వద్ద ఏకంగా 98,667 కొత్త మీటర్లు స్టాక్‌లో సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

విచిత్రమైన వివరణ

గోదాముల్లో వేలాది కొత్త మీటర్లు నిల్వ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పాత మీటర్లనే ఎందుకు వాడుతున్నారనే దానికి సంస్థ విచిత్రమైన వివరణ ఇచ్చింది. ఇటీవల స్మార్ట్‌ మీటర్లను అమర్చే క్రమంలో తొలగించిన పాత మీటర్లను మిగిలిన సర్వీస్‌ కనెక్షన్లకు పునర్వినియోగిస్తున్నామని చెప్పడం గమనార్హం. ఇలా ఇతర సర్వీసుల నుంచి తీసిన మీటర్లను ‘పాత మీటర్లు’గా పరిగణించలేమంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆ మీటర్లలో ఉన్న రీడింగ్‌ను ఇనీషియల్‌ రీడింగ్‌గా నమోదు చేసి బిల్లులు ఇస్తున్నామనీ.. దీనివల్ల వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని సమర్థించుకోవడం విశేషం. మరోవైపు నిబంధనల ప్రకారమే కొత్త మీటర్లకు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేస్తున్నామని, వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు వసూళ్లు చేయడం లేదన్నారు. అదేవిధంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై వినియోగదారులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురావడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆధునీకరణ చేపడుతున్నామని తెలిపారు. స్టాక్‌లో దాదాపు లక్ష కొత్త మీటర్లు ఉన్నాయని ప్రకటిస్తూనే.. మరోవైపు తొలగించిన మీటర్లనే ఇతర కనెక్షన్లకు బిగిస్తున్నామని చెప్పడం కొసమెరుపు.

మీటర్ల కొరతపై ఈపీడీసీఎల్‌ వింత వాదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement