25 నుంచి పనులు బంద్‌ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

25 నుంచి పనులు బంద్‌ చేస్తాం

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

జీవీఎంసీ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

డాబాగార్డెన్స్‌: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ జనరల్‌ ఫండ్‌ ద్వారా చెల్లించాలని, 2027 జనవరి 1 నుంచి నిధి పోర్టల్‌ ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేసి చెల్లింపులు చేపట్టాలని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ నెల 25లోగా పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే ఆ రోజు నుంచి జీవీఎంసీ పరిధిలో పనులన్నీ నిలిపివేస్తామని హెచ్చరించింది. జీవీఎంసీ ప్రాంగణంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. జనరల్‌ ఫండ్‌ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను నిధి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం వల్ల ఇప్పటికే పనులు చేపట్టి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టిన కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లుల ప్రాసెసింగ్‌, పనుల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నందున 2027 జనవరి 1 వరకు నిధి పోర్టల్‌ అప్‌లోడ్‌ నుంచి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఒకే ప్యాకేజీపై అభ్యంతరం

రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ సంయుక్తంగా భారీ మొత్తాలతో అభివృద్ధి పనులకు ఒకే ప్యాకేజీ విధానంలో టెండర్లు పిలవడంపై కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు కూడా పనుల్లో భాగస్వాములు అయ్యేలా టెండర్లను విభజించి పిలవాలని కోరారు. భారీ మొత్తాలతో ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలవడం వల్ల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. నిధి పోర్టల్‌ కారణంగా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, భారీ ఉమ్మడి ప్యాకేజీ టెండర్లను పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ల సమస్యలపై జీవీఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చించి పరిష్కారం చూపాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, రాజాన వెంకటరమణ, వీరారెడ్డి, జి.సింహాచలం, ఎం.రమేష్‌, శ్రీనివాసరావు, అప్పలరాజు, గొంప చంద్రమౌళి, షేక్‌ సిలార్‌, కోటేశ్వరరావు, రవికుమార్‌, అప్పలనాయుడు, సాదూరావు, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement