డాబాగార్డెన్స్: జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగంలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు, ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహాదేవ్ ఆనందరావు తెలిపారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మకు యూనియన్ ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యం, నాయకులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ తాగునీటి సరఫరా విభాగంలో సాంకేతిక విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వారు చేస్తున్న పనికి అనుగుణంగా హోదా, కేటగిరీ నమోదు చేయాలని కోరారు. కౌన్సిల్ తీర్మానాలు, జీవోలు, మెమోల మేరకు ఏరియర్స్ చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ నగరానికి నిరంతర తాగునీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బల్క్, సెమీ బల్క్, ఇంటి కుళాయిల ద్వారా జీవీఎంసీకి ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం సమకూరడంలోనూ వీరి సేవలు కీలకమన్నారు. జీవీఎంసీలో 280 మంది కార్మికులు మృతి చెందడం, మరో 60 మంది పదవీ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడి ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పనిభారం పెరిగిందన్నారు. పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉపాధి కల్పించి, ప్రస్తుత కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో పేర్లు ఉండటం వల్ల వితంతు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరారు. అప్కోస్‌లో హాజరు నమోదులో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, జీతాలు అందని కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ నాయకులు రామకృష్ణ, సతీష్, సాగరమూర్తి, ఈశ్వరరావు, జీవన్, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.


