మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఈ నెల 19న విశాఖ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనకు సంబంధించి భద్రత, వేదికలు, రవాణా, పార్కింగ్, ప్రజల రాకపోకలు తదితర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గురువారం పరిశీలించారు. ముందస్తు భద్రతా సమీక్షలో భాగంగా ఏయూ ప్రాంగణంలోని హెలీప్యాడ్, సీఎం పాల్గొనే పట్టాల పంపిణీ కార్యక్రమ వేదికను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని సందర్శించారు. ఏయూ వేదిక వద్ద కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, బీచ్‌రోడ్ కార్యక్రమానికి నోడల్ అధికారిగా ఉన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో ఏర్పాట్లపై సమీక్షించారు. నిర్దేశిత సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాలు సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


