ఆనందపురం: గంభీరం పంచాయతీలో ఉన్న ఐఐఎంవీ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈఎంబీఏ) నాలుగో బ్యాచ్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘లీడింగ్ వాట్స్ నెక్స్‌ట్’ చర్చాగోష్టితో పాటు ఈఎంబీఏ బ్రోచర్‌ను ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మాజీ చైర్మన్ రాజ్‌కుమార్ దూబే ఆవిష్కరించారు. మారుతున్న అంతర్జాతీయ వ్యాపార విధానాలు, కృత్రిమ మేధ సాంకేతికతకు అనుగుణంగా పనిచేస్తున్న నిపుణుల్లో నాయకత్వ లక్షణాలు, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను పెంపొందించేలా రెండేళ్ల ఈ కోర్సును రూపొందించారు. డైరెక్ట్ టు డివైస్ ఆన్‌లైన్ విధానంలో సాగే ఈ ప్రోగ్రామ్‌లో 740 గంటల లెర్నింగ్, మేనేజ్‌మెంట్ పాఠ్యాంశాలు, క్యాంపస్ ఇమ్మర్షన్ మాడ్యూల్స్‌తో పాటు డెన్మార్క్ అధ్యయన పర్యటన ఉంటుంది. కోర్సులో చేరేందుకు అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు మార్కుల్లో సడలింపు ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ డిగ్రీతో పాటు ఐఐఎంవీ పూర్వ విద్యార్థుల హోదా లభిస్తుంది.


