సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

● బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, ఏయూలో పట్టాల పంపిణీ ● ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సమీక్ష

మహారాణిపేట/విశాఖ విద్య: ఈ నెల 19న ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, 26,426 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, కన్వేయన్స్‌ డీడ్ల పంపిణీ కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు బీచ్‌రోడ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో పట్టాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పట్టాల పంపిణీకి 10 గ్యాలరీలు, 100 కౌంటర్లు ఏర్పాటు చేసి, నియోజకవర్గాలు, వార్డుల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు వీఆర్వోను ఇన్‌చార్జిగా నియమించి లబ్ధిదారుల వివరాలను పక్కాగా మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ముందుగా ఏయూ మైదానంలో వేదిక, గ్యాలరీలు, పార్కింగ్‌, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతులను కలెక్టర్‌ పరిశీలించారు. లబ్ధిదారులకు పికప్‌ పాయింట్లు, మార్గాలపై ముందుగానే సమాచారం అందించాలని, మధ్యాహ్నం 1 గంటకే వేదిక వద్దకు చేరుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని, ఈ నెల 18న రూట్‌మ్యాప్‌, పార్కింగ్‌పై మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశించారు. 18, 19 తేదీల్లో బీచ్‌రోడ్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య, విద్యుత్‌, తాగునీటి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశీలనలో ఎంపీ ఎం. శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌ రాజు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement