ఏర్పాట్లపై సమీక్ష
మహారాణిపేట: విశాఖలో ఈ నెల 19న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ సూచించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న వారిద్దరూ అధికారులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులందరికీ ముందుగానే ఆహ్వానపత్రాలు అందించాలన్నారు.
26,426 మంది లబ్ధిదారులు : జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాలు, కన్వేయన్స్ డీడ్‌ల పంపిణీకి సంబంధించి మొత్తం 26,426 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. భీమిలిలో 4,198, గాజువాకలో 5,597, పెందుర్తిలో 2,896, విశాఖ తూర్పులో 5,107, ఉత్తరలో 2,425, దక్షిణలో 1,228, పశ్చిమలో 4,975 మంది లబ్ధిదారులు ఉన్నట్లు వివరించారు. ఏయూలో జరిగే కార్యక్రమంలో అర్హులందరికీ పత్రాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. అదేరోజు ఆర్కే బీచ్ పరిసరాల్లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇన్‌కాయిస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిర్మల్ సాగర్ పైలట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.


