మహారాణిపేట: ఈ ఏడాది డిసెంబరులో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటక శాఖ కార్యదర్శి ఇప్పటికే రెండుసార్లు సమీక్షించారని, ఉత్సవ్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ‘విజిట్ వైజాగ్’ కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నగరానికి ప్రత్యేక బ్రాండ్ కల్పిస్తామన్నారు. కై లాసగిరి నుంచి భీమిలి వరకు బేసిటీ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సుమారు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు డీపీఆర్ డిసెంబర్ నాటికి సిద్ధమవుతుందని, అవసరమైన భూసేకరణకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. విశాఖకు వచ్చిన 58 పెట్టుబడి ప్రాజెక్టుల్లో 36 ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలినవి రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్‌లో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు, నవంబర్‌లో భాగస్వామ్య సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.


