కమర్షియల్ స్టాల్స్ తొలగించాలని పోలీసుల ఆదేశం వినాయక దర్శనం కూడా ఉచితంగానే ఉండాలని సూచన అధికారులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం
గాజువాక : గాజువాక శ్రీనగర్ వద్ద గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ, ఎస్‌వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య కంకణ మహాగణపతి (గాజుల గణపతి) ఉత్సవాలవద్ద ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ భారీ గణపతి విగ్రహంతో పాటు 21 కమర్షియల్ స్టాళ్లు, యమలోకం సెట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసునాయుడు, గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రితోపాటు రెవెన్యూ, ఫైర్ తదితర విభాగాల అధికారులు మంగళవారం జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఉత్సవం నిర్వహిస్తున్న ప్రాంగణంలో మొత్తం పరిస్థితిని పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేనికారణంగా ప్రాంగణంలోని కమర్షియల్ స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని నిర్వాహకులను ఆదేశించారు. దానికి వారు అంగీకరించకపోవడంతో అధికారులు, నిర్వాహకులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని, వినాయక విగ్రహ దర్శనం ఉచితంగానే కల్పించాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై స్పష్టమైన నివేదిక తయారు చేసిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు.
21 స్టాల్స్ నుంచి డబ్బుల వసూళ్లు : సీఐ
సీఐ వాసునాయుడు మాట్లాడుతూ గాజుల గణపతి దర్శనం కోసం నిర్వాహకులు రూ.100, యమలోకం సెట్టు చూడానికి రూ.80 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 21 స్టాళ్లను ఏర్పాటు చేసి వాటినుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాహనాల పార్కింగ్ కోసం స్థలం చూపించలేదని, దీనివల్ల సర్వీస్ రోడ్డు మూసుకుపోతోందని పేర్కొన్నారు. అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అందువల్ల స్టాళ్లను, యమలోకం సెట్టును తొలగించాలని ఆదేశించామన్నారు. అనుమతి లేకపోయినా విగ్రహం ఉంచి ఉచిత దర్శనాలు కల్పించాలని సూచించామని చెప్పారు.


