డాబాగార్డెన్స్/మద్దిలపాలెం: ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’చిత్రం ఘన విజయంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. థియేటర్లలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సూరి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని పేర్కొన్నారు. ‘మండాడి’ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలకు ముందే చిత్రంపై నమ్మకం వ్యక్తం చేసిన మైత్రి సంస్థ ప్రతినిధులు నవీన్, రవికి ధన్యవాదాలు చెప్పారు. సహనటుడు సుహాస్‌తో పాటు చిత్ర విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ సముద్రతీరం, మత్స్యకారుల జీవన విధానంతో అనుబంధం ఉన్న ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రమని సూరి పేర్కొన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి ఈ చిత్రంలో నటించినందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో సెంటిమెంట్ అన్నారు. ఇక్కడ సినిమా రెస్పాన్స్‌పై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాత ఎల్రెడ్ కుమార్, డిస్ట్రిబ్యూటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సూరి, సుహాస్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు.
నగరంలో సందడి చేసిన
‘మండాడి’ చిత్ర యూనిట్


