‘ఎస్‌ఐఆర్‌’తో బీజేపీ శాశ్వత అధికారానికి కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’తో బీజేపీ శాశ్వత అధికారానికి కుట్ర

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

అల్లిపురం: ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది ఓట్లను తొలగించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జీడీపీ 7.5 శాతంగా ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ, మాజీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ఆర్బీఐ మాజీ గవర్నర్లు వెల్లడించిన గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. విద్యా విధానాల్లో మార్పులు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల కాగ్‌ నివేదికలో 40 కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖర్చుల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రధాని మోదీని పొగడటానికే పరిమితమవుతోందని విమర్శించారు. లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు మోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ మెరుగైన ఫలితాలు సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.మన్మధరావు అధ్యక్షత వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్‌ రహిమాన్‌, సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ.విమల, కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, కె.వనజాక్షి, ఎం.డి.బేగం, ఆర్‌.శ్రీనివాసరావు, ఎన్‌.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement