మహారాణిపేట: మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నారని, కూటమి పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. భవిష్యత్తులో వైఎస్ జగన్ చేపట్టే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతమై, పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, పార్టీ నాయకులు మంచ నాగమల్లేశ్వరి, పీవీ నారాయణ, తాడి జగన్నాథ్ రెడ్డి, బోని శివరామకృష్ణ, బిపిన్ కుమార్‌జైన్, గాలి ప్రసాద్, చొల్లంగి నాగేశ్వరరావు, మధు, జగదీష్, కొట్యాడ సూర్య, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


