విశాఖలో విద్యాసంస్థల బంద్ సక్సెస్ ఢిల్లీలో లాఠీచార్జి, పేపర్ లీకేజీలపై కదం తొక్కిన విద్యార్థి సంఘాలు వీఎస్ కృష్ణా కళాశాల వద్ద ఉద్రిక్తత.. పేరెంట్స్ మీటింగ్ రద్దు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
మద్దిలపాలెం : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీచార్జి, వరుస ప్రశ్నపత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మద్దిలపాలెం మీదుగా డాక్టర్ వి.ఎస్.కృష్ణా కళాశాల వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో కృష్ణా కళాశాల ప్రాంగణంలోని జూనియర్, ఒకేషనల్ కళాశాలల్లో జరుగుతున్న పేరెంట్స్ సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వలయాన్ని దాటుకుని విద్యార్థులు లోపలికి దూసుకెళ్లి సమావేశ మందిరంలో బైఠాయించారు. విద్యార్థుల నినాదాలతో ప్రాంగణం హోరెత్తడంతో, యాజమాన్యం పేరెంట్స్ మీటింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం డిగ్రీ, ఒకేషనల్ కళాశాలల వద్ద కూడా నిరసన తెలిపిన విద్యార్థులు మద్దిలపాలెం కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
లాఠీచార్జి హేయమైన చర్య
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వరుస పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులతో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరపాల్సింది పోయి.. వారిపై భాష్ప వాయువు ప్రయోగించడం, లాఠీచార్జి చేసి గాయపరచడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని పట్టుబట్టారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు రాజు, ఎర్నికుమార్, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.విశ్వనాథ్, పీడీఎస్‌వో జిల్లా కార్యదర్శి లక్ష్మి, నాయకులు విశ్వనాథ్, జానకి, సతీష్, వి.లక్ష్మి, శ్రీరామ్, వర్ధన్, ప్రసన్న కుమార్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల నినాదాలు అడ్డుకుంటున్న పోలీసులు


