రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి కన్నబాబు
సింహాచలం: సింహాచలం గిరిప్రదక్షిణ ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి కె.కన్నబాబు సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింహగిరిని సందర్శించిన ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల దర్శన క్యూలైన్లతో పాటు దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు. ముఖ్యంగా కియోస్క్ యంత్రాలు, ‘మనమిత్ర’ యాప్ ద్వారా స్వయంగా దర్శన టికెట్‌ను బుక్ చేసి డిజిటల్ సేవల పనితీరును పరీక్షించారు. పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలను దేవస్థానం ఈవో వెంకటరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, సహాయ కమిషనర్ అన్నపూర్ణ, దేవస్థానం ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


