బీచ్‌రోడ్డు: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సీఐటీయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ విశాఖ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనజాగరణ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాజం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనజాగరణ కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఇంత తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆర్.కె.ఎస్.వి. కుమార్, బి.పద్మ, జి.అజయ్, కె.మహేష్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


