న్యూస్‌రీల్
గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని పోర్టు ఐదుసార్లు టెండర్లు విఫలమైనా కొనసాగుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు టెండర్ల నిర్వహణకే రూ.50 లక్షల వరకూ ఖర్చు ఆస్పత్రి అభివృద్ధికి నిధులివ్వాలంటున్న సంఘాలు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్
అప్పన్న పుష్పరథం ట్రయల్‌రన్
రూ.అరకోటికి
సింహాచలం: ఈ నెల 28న నిర్వహించనున్న గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పుష్పరథానికి దేవస్థానం అధికారులు గురువారం ట్రయల్‌రన్ నిర్వహించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో కొంతదూరం పుష్పరథాన్ని తిప్పి రహదారి పరిస్థితులు, మలుపుల వద్ద రథం సాఫీగా ప్రయాణించే విధానాన్ని పరిశీలించారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం కొండదిగువన ఉన్న తొలిపావంచా వద్ద నుంచి పుష్పరథయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో పర్యటించి రాత్రికి తిరిగి చేరుకోనుంది. ట్రయల్‌రన్‌లో దేవస్థానం ఈవో వెంకటరావు, ఈఈ రాంబాబు, ఏఈవో రమణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
సాక్షి, విశాఖపట్నం: సొంత ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు పైసా ఖర్చు చేయడానికి వెనుకాడుతున్న పోర్టు యాజమాన్యం.. దాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు మాత్రం లక్షలాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తోంది. పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి ప్రైవేటీకరణపై యాజమాన్యం పట్టిన మొండిపట్టు ఇప్పుడు ప్రజాధనం దుబారాకు కారణమవుతోంది. ఆస్పత్రిని ప్రైవేటీకరించొద్దంటూ ఉద్యోగులు, కార్మికులు రెండేళ్లుగా నిరంతరం ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఇప్పటివరకు ఐదుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రాకపోవడం యాజమాన్య నిర్ణయానికే చెంపపెట్టులా మారింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా టెండర్ల పేరుతో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ అరకోటి రూపాయలను ఆస్పత్రి ఆధునికీకరణకు, అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు వెచ్చించి ఉంటే ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేదని ఉద్యోగులు చెబుతున్నారు.
40 వేల మందికి ఆరోగ్య భరోసా
విశాఖ పోర్టు అథారిటీ 1984లో సాలిగ్రామపురంలో 150 పడకల సామర్థ్యంతో గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని నిర్మించింది. ప్రస్తుతం భవనంలోని కొన్ని విభాగాలు పాతబడటంతో 80 పడకలకే పరిమితమైంది. ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రిలో 1.21 ఎకరాల్లో ఐదు అంతస్తుల ప్రధాన భవనం ఉంది. ఈఎన్‌టీ, డెంటల్, న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, గైనకాలజీ, పల్మనాలజీ, నేత్ర వైద్యం, స్పైన్ సర్జరీతో పాటు హోమియోపతి, ఆయుర్వేద వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. పోర్టులో పనిచేసే సుమారు 4 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పూల్ కలాసీలు, సీహెచ్‌డీ క్యాజువల్ కార్మికులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, పింఛనుదారులు కలిపి దాదాపు 40 వేల మంది ఈ ఆస్పత్రిపై ఆధారపడుతున్నారు. వీరందరికీ ప్రత్యేక హెల్త్‌కార్డుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.
300 పడకల పేరుతో ప్రైవేటీకరణ
గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థకు అప్పగించాలని వీపీఏ అధికారులు నిర్ణయించారు. 2024లో ఇందుకోసం టెండర్లు ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న 150 పడకల ఆస్పత్రిని 300 పడకలకు విస్తరిస్తామని, రూ.224.43 కోట్లతో ఆధునికీకరిస్తామని చెబుతూ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇంత ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిని పోర్టు నిధులతోనే అభివృద్ధి చేయాల్సిందిపోయి, ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు యాజమాన్యం కంకణం కట్టుకోవడంపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా ఉద్యమం..
స్పందించని యాజమాన్యం
గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రి ఆవరణతో పాటు పోర్టు పరిపాలన భవనం ఎదుట ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అయినా యాజమాన్యం మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సంకేతాలు ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది పోర్టుకు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పుడు, ఉద్యోగుల ఆస్పత్రిని స్వయంగా అభివృద్ధి చేయకుండా ప్రైవేటుకు అప్పగించడం సమంజసమేనా అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
టెండర్లకే అరకోటి.. ఫలితం సున్నా
ప్రైవేటీకరణ ప్రక్రియలో అత్యంత వివాదాస్పదంగా మారింది టెండర్ల వ్యవహారమే. ఇప్పటివరకు ఐదుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. ప్రైవేటు సంస్థలను ఆకర్షించేందుకు టెండర్ పత్రాల రూపకల్పన, నిబంధనల మార్పులు, న్యాయ సలహాలు, డాక్యుమెంటేషన్ వంటి ప్రక్రియలకే భారీగా ఖర్చు చేశారు. కేవలం టెండర్ల ప్రక్రియకే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రజాధనం వెచ్చించినట్లు సమాచారం. అయితే, ఈ ఖర్చుతో కూడా ఒక్క సంస్థ ముందుకు రాకపోవడం యాజమాన్య వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ మొత్తాన్ని ఆస్పత్రి భవనాల మరమ్మతులు, ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక వసతుల మెరుగుదలకు వినియోగించి ఉంటే ఆస్పత్రి రూపురేఖలే మారిపోయేవని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రజాధనాన్ని టెండర్ల పేరుతో వృథా చేయడం కంటే, గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రిని ప్రభుత్వ సంస్థగానే కొనసాగిస్తూ ఆధునికీకరించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


