88,561 కనెక్షన్లతో 475.33 మెగావాట్ల సామర్థ్యం ఒక్క ఏడాదిలోనే 51,583 కొత్త సోలార్ వ్యవస్థలు ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్
మహారాణిపేట: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు వేగంగా విస్తరిస్తోందని సంస్థ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. జూన్ 30 నాటికి సంస్థ పరిధిలో మొత్తం 88,561 మంది వినియోగదారులు 475.33 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి గ్రిడ్‌తో అనుసంధానించినట్లు వెల్లడించారు. గురువారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నాలుగు ఆర్థిక సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే రూఫ్‌టాప్ సోలార్ విస్తరణలో ఏటా గణనీయమైన వృద్ధి నమోదైందన్నారు. ఒక్క 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే 51,583 వ్యవస్థలు ఏర్పాటు కావడం ద్వారా సంస్థ చరిత్రలోనే అత్యధిక వార్షిక ప్రగతి నమోదైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్హులైన 2 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


